కొండా చూతము రారో కొండుక తిరుమల కొండా
(॥పల్లవి॥)
కొండా చూతము రారో కొండుక తిరుమల కొండా
కొండని యడిగిన వరము లొసఁగు మా కొండలతిమ్మయ కొండా
(॥కొండా॥)
మేరువు మును స్తుతియింపఁగను వారిజసంభవుఁడా
పేరు కలుగు నవరత్నంబులు బంగారము కల్పతరువూ
మేరకు మీఱఁ గని నెలవున నారుగ నిడెనొకో యనఁగా
ధారుణి బ్రహ్మాండములకు నాధారంబగు మా కొండా
(॥కొండా॥)
గరుడాచలం బనఁగా శ్రీవేంకటశైలం బనఁగా
గిరులకు నేలికె యగు ననంతగిరి దా నీ గిరి యనఁగా
సిరులాయఁ జనమగు యంజనశబరి యనెడినామములా
పరగఁగ నాలుగు యుగముల వెలసిన ప్రబలంబగు మా కొండా
(॥కొండా॥)
పొదలూ సొంపగు నింపుల పూబొదలూ వాసననదులూ
కొదలూ గల తామరకొలఁకులపై మెదలుఁ దుమ్మెదలూ
కదలి మలయానిలు వలపులపన కదళీవనములునూ
మొదలు గా నెల్లప్పుడు నీ సంపదలు గల మా కొండా
(॥కొండా॥)
జంతువు లెల్లను మునులూ సకలమైన దేవతలూ
జంతువుల యెలుఁగులు వేదసారంబగు హరినుతులూ
చింతామణులట రాళ్లెల్లను సిరులనెలవు లా గుహలూ
సంతతసౌభాగ్యంబుల నొప్పెడు సందడిగల మా కొండా
(॥కొండా॥)
వొకచో బ్రహ్మాదులు మునులును వొకచో నింద్రాదులునూ
వొకచో భాగవతులు యతులు శ్రుతులువొకచోఁ జంద్రార్కులు
వొకచో తీర్థంబులు గిరులును వొకచో యోగీశ్వరులూ
అకలంకత తనుఁ గోరి తపముసేయ నాస లెఱుఁగు మా కొండా
(॥కొండా॥)
శుకములతోఁ జదువుదురా శుకబ్రహ్మాదులు శ్రుతులూ
తకదిమ్మని యాడించు మయూరతతిని యోగీశ్వరులూ
సకలపురాణంబులు విందురు మఱి పికశారికలచే మునులూ
ప్రకటితముగ నీ విద్యల నొప్పెడు భాగ్యముకల మాకొండా
(॥కొండా॥)
స్వామితీర్థములకును స్వామిపుష్కరణియునూ
పామరులా యమరులఁ జేయును పాపవినాశనమూ
తా మహిఁ గోరిక లిచ్చుఁ గుమారధారయు పాండవసరసీ
కామితఫలదాయిని ఆకాశగంగయుఁ గల మా కొండా
(॥కొండా॥)
యిదియె క్షీరాంబుధి యనుచు మరి యిదియె ద్వారక యనుచు
యిదియె నందవ్రజ మనుచును మరి యిది దా నయోధ్య యనుచూ
యిదియె వైకుంఠం బనుచును యిది పరతత్త్వంబనుచు
యిదియె పరమపదం బనుచు వేదములు యెన్నఁగఁ గల మా కొండా
(॥కొండా॥)
తలఁచిన శుకశౌనకాదులకు తలఁచిన తలఁ పొసఁగినా
తలఁపు లోపల నెలకొన్నా దయతో నన్నేలినా
చెలువుఁడు మావెంకటరాయఁడు సిరులనెలవు చేకొన్నా
కలియుగవైకుంఠం బనునామము గలిగి వెలయు మా కొండా
(||pallavi||)
kŏṁḍā sūdamu rāro kŏṁḍuga tirumala kŏṁḍā
kŏṁḍani yaḍigina varamu lŏsam̐gu mā kŏṁḍaladimmaya kŏṁḍā
(||kŏṁḍā||)
meruvu munu studiyiṁpam̐ganu vārijasaṁbhavum̐ḍā
peru kalugu navaratnaṁbulu baṁgāramu kalbadaruvū
meragu mīṟam̐ gani nĕlavuna nāruga niḍĕnŏgo yanam̐gā
dhāruṇi brahmāṁḍamulagu nādhāraṁbagu mā kŏṁḍā
(||kŏṁḍā||)
garuḍāsalaṁ banam̐gā śhrīveṁkaḍaśhailaṁ banam̐gā
girulagu neligĕ yagu nanaṁtagiri dā nī giri yanam̐gā
sirulāyam̐ janamagu yaṁjanaśhabari yanĕḍināmamulā
paragam̐ga nālugu yugamula vĕlasina prabalaṁbagu mā kŏṁḍā
(||kŏṁḍā||)
pŏdalū sŏṁpagu niṁpula pūbŏdalū vāsananadulū
kŏdalū gala tāmaragŏlam̐kulabai mĕdalum̐ dummĕdalū
kadali malayānilu valabulabana kadaḽīvanamulunū
mŏdalu gā nĕllappuḍu nī saṁpadalu gala mā kŏṁḍā
(||kŏṁḍā||)
jaṁtuvu lĕllanu munulū sagalamaina devadalū
jaṁtuvula yĕlum̐gulu vedasāraṁbagu harinudulū
siṁtāmaṇulaḍa rāḽlĕllanu sirulanĕlavu lā guhalū
saṁtadasaubhāgyaṁbula nŏppĕḍu saṁdaḍigala mā kŏṁḍā
(||kŏṁḍā||)
vŏgaso brahmādulu munulunu vŏgaso niṁdrādulunū
vŏgaso bhāgavadulu yadulu śhruduluvŏgasom̐ jaṁdrārgulu
vŏgaso tīrdhaṁbulu girulunu vŏgaso yogīśhvarulū
agalaṁkada tanum̐ gori tabamuseya nāsa lĕṟum̐gu mā kŏṁḍā
(||kŏṁḍā||)
śhugamuladom̐ jaduvudurā śhugabrahmādulu śhrudulū
tagadimmani yāḍiṁchu mayūradadini yogīśhvarulū
sagalaburāṇaṁbulu viṁduru maṟi pigaśhārigalase munulū
pragaḍidamuga nī vidyala nŏppĕḍu bhāgyamugala māgŏṁḍā
(||kŏṁḍā||)
svāmidīrdhamulagunu svāmibuṣhkaraṇiyunū
pāmarulā yamarulam̐ jeyunu pābavināśhanamū
tā mahim̐ goriga lichchum̐ gumāradhārayu pāṁḍavasarasī
kāmidaphaladāyini āgāśhagaṁgayum̐ gala mā kŏṁḍā
(||kŏṁḍā||)
yidiyĕ kṣhīrāṁbudhi yanusu mari yidiyĕ dvāraga yanusu
yidiyĕ naṁdavraja manusunu mari yidi dā nayodhya yanusū
yidiyĕ vaiguṁṭhaṁ banusunu yidi paradattvaṁbanusu
yidiyĕ paramabadaṁ banusu vedamulu yĕnnam̐gam̐ gala mā kŏṁḍā
(||kŏṁḍā||)
talam̐sina śhugaśhaunagādulagu talam̐sina talam̐ pŏsam̐ginā
talam̐pu lobala nĕlagŏnnā dayado nannelinā
sĕluvum̐ḍu māvĕṁkaḍarāyam̐ḍu sirulanĕlavu segŏnnā
kaliyugavaiguṁṭhaṁ banunāmamu galigi vĕlayu mā kŏṁḍā