కలలోన నీ రూపే కాయములో నీ రూపే
(॥పల్లవి॥)
కలలోన నీ రూపే కాయములో నీ రూపే
వెలి నిన్నుఁ బాసి నను వేగించు టెట్టురా
(॥కలలో॥)
ముంచి నీ మొగమునఁ గట్టిన ట్టయ్యీ
మించు నాలుగుచేతుల మెఱుఁగులు దలఁ పయ్యీ
మంచి నీ పాదము లివె మతిలోనఁ బాయ వివే
యించుకంతా మఱవలె నెట్టు ధరియించేరా
(॥కలలో॥)
కట్టిన చంద్రగావి కఠారిమొలకట్టు
పెట్టిన వొడ్డాణము ప్రేమములు రేఁచీని
మట్టు నీ చక్కదనాలు మర్మములు గలఁచీని
నెట్టన నే నిన్నుఁ బాసి నిలుచుట యెట్టురా
(॥కలలో॥)
వుదరబంధము నాభి వొప్పునున్నఁ దిరుమేను
తుద నలమేలుమంగతోడివురము
యిదే శ్రీవేంకటేశ నిన్నెగపోసి దిగపోసి
పొదిగి యిట్టే కూడకపోవ నెట్టువచ్చురా
(||pallavi||)
kalalona nī rūbe kāyamulo nī rūbe
vĕli ninnum̐ bāsi nanu vegiṁchu ṭĕṭṭurā
(||kalalo||)
muṁchi nī mŏgamunam̐ gaṭṭina ṭṭayyī
miṁchu nālugusedula mĕṟum̐gulu dalam̐ payyī
maṁchi nī pādamu livĕ madilonam̐ bāya vive
yiṁchugaṁtā maṟavalĕ nĕṭṭu dhariyiṁcherā
(||kalalo||)
kaṭṭina saṁdragāvi kaṭhārimŏlagaṭṭu
pĕṭṭina vŏḍḍāṇamu premamulu rem̐sīni
maṭṭu nī sakkadanālu marmamulu galam̐sīni
nĕṭṭana ne ninnum̐ bāsi nilusuḍa yĕṭṭurā
(||kalalo||)
vudarabaṁdhamu nābhi vŏppununnam̐ dirumenu
tuda nalamelumaṁgadoḍivuramu
yide śhrīveṁkaḍeśha ninnĕgabosi digabosi
pŏdigi yiṭṭe kūḍagabova nĕṭṭuvachchurā