కాఁగిలించుకొనవే గక్కన నీ రమణుని
(॥పల్లవి॥)
కాఁగిలించుకొనవే గక్కన నీ రమణుని
కాఁగి కరఁగినమేలు గట్టాయఁ జాలదా
(॥కాగి॥)
బిగువు నీచన్నులందు బెరసీని చాలదా
బిగియఁగావలెనా ప్రియునితోడ
వొగరు చిగురుమోవి నుట్టిపడీఁ జాలదా
వొగరుమాఁటలు వేరె వొలుకగవలెనా
(॥కాగి॥)
పెనగొని నీనెరులు పెక్కులయ్యీఁ జాలదా
పెనఁగఁగవలెనా పిలువఁగానే
మొనసెఁ బులకలు కమ్ముక మేనఁ జాలదా
మొనలగోళ్లఁ జూపి మోప నింకా వలెనా
(॥కాగి॥)
నాఁటుకొనె నీప్రియము నగవులఁ జాలదా
నాఁటఁజూడవలెనా నయములనె
మీఁటె వలమేల్మంగవు మీఁదఁ గప్ప మిట్టె కూడి
మీఁటె వేలు శ్రీవేంకటమేఁటి నీపైఁ జాలదా
(||pallavi||)
kām̐giliṁchugŏnave gakkana nī ramaṇuni
kām̐gi karam̐ginamelu gaṭṭāyam̐ jāladā
(||kāgi||)
biguvu nīsannulaṁdu bĕrasīni sāladā
bigiyam̐gāvalĕnā priyunidoḍa
vŏgaru sigurumovi nuṭṭibaḍīm̐ jāladā
vŏgarumām̐ṭalu verĕ vŏlugagavalĕnā
(||kāgi||)
pĕnagŏni nīnĕrulu pĕkkulayyīm̐ jāladā
pĕnam̐gam̐gavalĕnā piluvam̐gāne
mŏnasĕm̐ bulagalu kammuga menam̐ jāladā
mŏnalagoḽlam̐ jūbi moba niṁkā valĕnā
(||kāgi||)
nām̐ṭugŏnĕ nīpriyamu nagavulam̐ jāladā
nām̐ṭam̐jūḍavalĕnā nayamulanĕ
mīm̐ṭĕ valamelmaṁgavu mīm̐dam̐ gappa miṭṭĕ kūḍi
mīm̐ṭĕ velu śhrīveṁkaḍamem̐ṭi nībaim̐ jāladā