ఇవి సేయఁగ నే నలసుఁడ యెటువలె మోక్షం బడిగెదను
(॥పల్లవి॥)
ఇవి సేయఁగ నే నలసుఁడ యెటువలె మోక్షం బడిగెదను
వివరముతోడుత నీవు సులభుఁడవు విష్ణుఁడ నిన్నే కొలిచెదఁ గాక
(॥ఇవి॥)
జపయజ్ఞదానకర్మంబులు యెంచఁగ జిరకాలఫలంబులు
యెపుడుఁ బుణ్యతీర్థస్నానములు యిల పాపవిమోచనములు
అపరిమిత దేవతాంతరభజనలు ఆయాలోకప్రాప్తులు
వుపవాసాది నియమవ్రతములు తపోనిష్ఠకుఁ గారణంబులు
(॥ఇవి॥)
రవిచంద్రగ్రహతారాబలములు భువిలోఁ గామ్యఫలములు
తవిలిన పంచేంద్రియనిగ్రహంబులు తనుధరులకు దుర్లభములు
అవిరళ ధర్మార్థకామంబులు మఱి యైశ్వర్యములకు మూలములు
అవల గ్రహణకాలానుష్ఠానము లధికఫలంబులు ఆశామయము
(॥ఇవి॥)
పరగ సప్తసంతానబ్రాహణతర్పణములు ఖ్యాతిసుకృతములు
అరయఁ బుత్రదారక్షేత్రసంగ్రహ మందరికిని సంసారభోగము
హరి నరహరి శ్రీవేంకటేశ్వరా అఖిలము నొఁసగెడి దాతవు
సరుగన నీవే దయతో రక్షించఁజాలుదు వేకాలమును మమ్మును
(||pallavi||)
ivi seyam̐ga ne nalasum̐ḍa yĕḍuvalĕ mokṣhaṁ baḍigĕdanu
vivaramudoḍuda nīvu sulabhum̐ḍavu viṣhṇum̐ḍa ninne kŏlisĕdam̐ gāga
(||ivi||)
jabayajñadānagarmaṁbulu yĕṁcham̐ga jiragālaphalaṁbulu
yĕbuḍum̐ buṇyadīrdhasnānamulu yila pābavimosanamulu
abarimida devadāṁtarabhajanalu āyālogaprāptulu
vubavāsādi niyamavradamulu taboniṣhṭhagum̐ gāraṇaṁbulu
(||ivi||)
ravisaṁdragrahadārābalamulu bhuvilom̐ gāmyaphalamulu
tavilina paṁcheṁdriyanigrahaṁbulu tanudharulagu durlabhamulu
aviraḽa dharmārdhagāmaṁbulu maṟi yaiśhvaryamulagu mūlamulu
avala grahaṇagālānuṣhṭhānamu ladhigaphalaṁbulu āśhāmayamu
(||ivi||)
paraga saptasaṁtānabrāhaṇadarbaṇamulu khyādisukṛtamulu
arayam̐ butradārakṣhetrasaṁgraha maṁdarigini saṁsārabhogamu
hari narahari śhrīveṁkaḍeśhvarā akhilamu nŏm̐sagĕḍi dādavu
sarugana nīve dayado rakṣhiṁcham̐jāludu vegālamunu mammunu