ఇట్టివిందు గంటివా నీ వెక్కడనైనా
(॥పల్లవి॥)
ఇట్టివిందు గంటివా నీ వెక్కడనైనా
అట్టె ఆకె పొత్తున నీ వారగించవయ్యా
(॥ఇట్టి॥)
కలికికెమ్మోవితీపు కమ్మని తేనెలవిందు
చలువచూపులు నీకుఁ జక్కెరవిందు
సెలవిలేనవ్వులే చిలుపాలతోడివిందు
అలమేలుమంగ సేసీ నారగించవయ్యా
(॥ఇట్టి॥)
కాంతగోరిచెనకులు కారపుఁగూరలవిందు
పంతపుమాటలే ఆవపచ్చడివిందు
వింతబొమ్మజంకెనలే వేఁడిపడిదాలవిందు
అంతసేసీ నీదేవి యారగించవయ్యా
(॥ఇట్టి॥)
ఱట్టడి సమరతియాఱడి తరితీపువిందు
గట్టిసిగ్గు పెరుగుమీఁగడలవిందు
గుట్టుతో మన్నించితివి కొమ్మను శ్రీవేంకటేశ
అట్టె నీతనివిదీర నారగించవయ్యా
(||pallavi||)
iṭṭiviṁdu gaṁṭivā nī vĕkkaḍanainā
aṭṭĕ āgĕ pŏttuna nī vāragiṁchavayyā
(||iṭṭi||)
kaligigĕmmovidību kammani tenĕlaviṁdu
saluvasūbulu nīgum̐ jakkĕraviṁdu
sĕlavilenavvule silubāladoḍiviṁdu
alamelumaṁga sesī nāragiṁchavayyā
(||iṭṭi||)
kāṁtagorisĕnagulu kārabum̐gūralaviṁdu
paṁtabumāḍale āvabachchaḍiviṁdu
viṁtabŏmmajaṁkĕnale vem̐ḍibaḍidālaviṁdu
aṁtasesī nīdevi yāragiṁchavayyā
(||iṭṭi||)
ṟaṭṭaḍi samaradiyāṟaḍi taridībuviṁdu
gaṭṭisiggu pĕrugumīm̐gaḍalaviṁdu
guṭṭudo manniṁchidivi kŏmmanu śhrīveṁkaḍeśha
aṭṭĕ nīdanividīra nāragiṁchavayyā