ఇప్పుడు విచ్చేసి వున్నాఁ డెదుటఁ దాను
(॥పల్లవి॥)
ఇప్పుడు విచ్చేసి వున్నాఁ డెదుటఁ దాను
తప్పక నన్నుఁ బాయక దయఁజూడుమనరే
(॥ఇప్పు॥)
యెదురు చూపులవల్ల యెడమాఁటలవల్ల
అదనఁ దా వచ్చెననే యాసలవల్ల
పెదవులఁ దన పేరు పేరుకొనే యందువల్ల
యెదలో నమ్మివుందాన నిట్టె విన్నవించరే
(॥ఇప్పు॥)
తలపోఁతలవల్ల తమకంబులవల్ల
కలలోన నెనసే సంగతులవల్ల
వెలయఁ బెండ్లాడిన వేడుక లంటినవల్ల
యెలమిఁ గాచుకుందాన నిట్టె విన్నవించరే
(॥ఇప్పు॥)
వినుకలిఁ జొక్కేవల్ల వేడుక సిగ్గులవల్ల
ఘనుఁడు దా నంపిన లేకలవల్ల
నను దానె వచ్చి కూడినాడు శ్రీవేంకటేశుఁడు
యెనగొని వుందాన నిట్టె విన్నవించారే
(||pallavi||)
ippuḍu vichchesi vunnām̐ ḍĕduḍam̐ dānu
tappaga nannum̐ bāyaga dayam̐jūḍumanare
(||ippu||)
yĕduru sūbulavalla yĕḍamām̐ṭalavalla
adanam̐ dā vachchĕnane yāsalavalla
pĕdavulam̐ dana peru perugŏne yaṁduvalla
yĕdalo nammivuṁdāna niṭṭĕ vinnaviṁchare
(||ippu||)
talabom̐talavalla tamagaṁbulavalla
kalalona nĕnase saṁgadulavalla
vĕlayam̐ bĕṁḍlāḍina veḍuga laṁṭinavalla
yĕlamim̐ gāsuguṁdāna niṭṭĕ vinnaviṁchare
(||ippu||)
vinugalim̐ jŏkkevalla veḍuga siggulavalla
ghanum̐ḍu dā naṁpina legalavalla
nanu dānĕ vachchi kūḍināḍu śhrīveṁkaḍeśhum̐ḍu
yĕnagŏni vuṁdāna niṭṭĕ vinnaviṁchāre