ఇప్పుడే కంటిమి నేఁడు యీ కొత్తలు
(॥పల్లవి॥)
ఇప్పుడే కంటిమి నేఁడు యీ కొత్తలు
కుప్పలుఁ దెప్పలునాయ గురుతు లన్నియును
(॥ఇప్పు॥)
ముప్పిరి నీ సెలవుల ముదురువెన్నెలగాసీ
చొప్పుగా మోవిమీఁదఁ జుక్కలు గాసీ
కొప్పున నుండి మెల్లనె కురిసీఁ బువ్వులవాన
చెప్పవే నీకతలెల్లా సిగ్గులేల ఇఁకను
(॥ఇప్పు॥)
జిగిఁ జన్నుగొండల పై సెలయేరులు వారీ
మొగము పై జారిజారి మొయిలువారీని
మిగులాఁ జెక్కులమీఁద మెరుఁగుగళలు మించీ
తగ నాకు నూచించవే తలవంచనేఁటికి
(॥ఇప్పు॥)
మఱి నీ కనుఁగొనల మాణికము లుప్పతిలీ
వుఱకమై జాజినన లుప్పతిలీని
జఱసి శ్రీవేంకటేశ్వరుఁడు నిన్నేలఁబోలు
యెఱిఁగించవే నాకు నిట్టె సంతోసించేను
(||pallavi||)
ippuḍe kaṁṭimi nem̐ḍu yī kŏttalu
kuppalum̐ dĕppalunāya gurudu lanniyunu
(||ippu||)
muppiri nī sĕlavula muduruvĕnnĕlagāsī
sŏppugā movimīm̐dam̐ jukkalu gāsī
kŏppuna nuṁḍi mĕllanĕ kurisīm̐ buvvulavāna
sĕppave nīgadalĕllā siggulela im̐kanu
(||ippu||)
jigim̐ jannugŏṁḍala pai sĕlayerulu vārī
mŏgamu pai jārijāri mŏyiluvārīni
migulām̐ jĕkkulamīm̐da mĕrum̐gugaḽalu miṁchī
taga nāgu nūsiṁchave talavaṁchanem̐ṭigi
(||ippu||)
maṟi nī kanum̐gŏnala māṇigamu luppadilī
vuṟagamai jājinana luppadilīni
jaṟasi śhrīveṁkaḍeśhvarum̐ḍu ninnelam̐bolu
yĕṟim̐giṁchave nāgu niṭṭĕ saṁtosiṁchenu