ఇన్నిటా నీ బత్తులు నే మెరిఁగినవే
(॥పల్లవి॥)
ఇన్నిటా నీ బత్తులు నే మెరిఁగినవే
పిన్నదాన నా చన్నులు పిసుకకువయ్యా
(॥ఇన్ని॥)
చెక్కులు నొక్కుచు నాకుఁ జేరి ప్రియాలు చెప్పేవు
పక్కనఁ దిట్టకుంటేనే పదివేలు
యెక్కడి సుద్దులు మమ్మునేల తడవేవు నీవు
మొక్కేముగాని మాకొంగు ముట్టకువయ్య
(॥ఇన్ని॥)
పంతమున నాకు యిన్ని బాసలేల సేసేవు
వింతవారిఁ దేకుండితే వేవేలు
యెంత లేదు నీవుమాతోనేఁటికిని నవ్వేవు
యెంతైనా సేవ సేసేము యిక్కువంటకువయ్యా
(॥ఇన్ని॥)
జట్టిగొని నన్ను నేల సారె సారెఁ బొగడేవు
గుట్టున నీ వుండితేనే కోటానఁగోటి
యిట్టె శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
బెట్టుగ మెచ్చేఁగాని పెనఁగకువయ్యా
(||pallavi||)
inniḍā nī battulu ne mĕrim̐ginave
pinnadāna nā sannulu pisugaguvayyā
(||inni||)
sĕkkulu nŏkkusu nāgum̐ jeri priyālu sĕppevu
pakkanam̐ diṭṭaguṁṭene padivelu
yĕkkaḍi suddulu mammunela taḍavevu nīvu
mŏkkemugāni māgŏṁgu muṭṭaguvayya
(||inni||)
paṁtamuna nāgu yinni bāsalela sesevu
viṁtavārim̐ deguṁḍide vevelu
yĕṁta ledu nīvumādonem̐ṭigini navvevu
yĕṁtainā seva sesemu yikkuvaṁṭaguvayyā
(||inni||)
jaṭṭigŏni nannu nela sārĕ sārĕm̐ bŏgaḍevu
guṭṭuna nī vuṁḍidene koḍānam̐goḍi
yiṭṭĕ śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
bĕṭṭuga mĕchchem̐gāni pĕnam̐gaguvayyā