ఇన్నిటా జాణవు నీకు యెవ్వరు గుద్ది చెప్పేరు
(॥పల్లవి॥)
ఇన్నిటా జాణవు నీకు యెవ్వరు గుద్ది చెప్పేరు
యెన్నికె కెక్కిన నీ ఇంటిలోనివారము
(॥ఇన్ని॥)
అక్కరతోడఁ బొరుగాపె నిన్నుఁ జెనకఁగా
చెక్కు నొక్కి నన్ను నెంత చిమ్మి రేఁ చేవు
పుక్కిటిబంటి వలపు పోరచి నీకురాఁగాను
పిక్కటిల్ల నిందు వెలవెట్టి కొనవలెనా
(॥ఇన్ని॥)
వేడుకతో నాపె నేఁడు విందు నీకుఁ జెప్పఁగాను
యీడ నిట్టె మాపొత్తుకు నేల వచ్చేవు
వీడని చుట్టరికము వెంట వెంటఁ దగులఁగా
యీడు వెట్టి మాపొందుల కేఁకరఁగవలెనా
(॥ఇన్ని॥)
కూరిమితోడుత నాపె కొంగువట్టుకుండఁగాను
గారవించి నన్ను నెంత కాఁగిలించేవు
ఆరీతి శ్రీ వేంకటేశ అందుఁదరితీపు లూరె
ఆరసి మామోవితేనె లడుగఁగ వలెనా
(||pallavi||)
inniḍā jāṇavu nīgu yĕvvaru guddi sĕpperu
yĕnnigĕ kĕkkina nī iṁṭilonivāramu
(||inni||)
akkaradoḍam̐ bŏrugābĕ ninnum̐ jĕnagam̐gā
sĕkku nŏkki nannu nĕṁta simmi rem̐ sevu
pukkiḍibaṁṭi valabu porasi nīgurām̐gānu
pikkaḍilla niṁdu vĕlavĕṭṭi kŏnavalĕnā
(||inni||)
veḍugado nābĕ nem̐ḍu viṁdu nīgum̐ jĕppam̐gānu
yīḍa niṭṭĕ mābŏttugu nela vachchevu
vīḍani suṭṭarigamu vĕṁṭa vĕṁṭam̐ dagulam̐gā
yīḍu vĕṭṭi mābŏṁdula kem̐karam̐gavalĕnā
(||inni||)
kūrimidoḍuda nābĕ kŏṁguvaṭṭuguṁḍam̐gānu
gāraviṁchi nannu nĕṁta kām̐giliṁchevu
ārīdi śhrī veṁkaḍeśha aṁdum̐daridību lūrĕ
ārasi māmovidenĕ laḍugam̐ga valĕnā