ఇంతి నేరుపులు నీతో నెంతని చెప్పఁగవచ్చు
(॥పల్లవి॥)
ఇంతి నేరుపులు నీతో నెంతని చెప్పఁగవచ్చు
వింతలెల్లాఁ జూతువు వేగమె రావయ్యా
(॥ఇంతి॥)
చిమ్మిరేఁగే వలపులు చెలియ గాదెలఁబోసె
వుమ్మగిలుఁ దమకము నొడిఁగట్టెను
కుమ్మరింపుఁ గోరికలు కూడబెట్టుకొని నిన్ను
రమ్మని పిలువనంపె రామయ్య ఇఁకను
(॥ఇంతి॥)
గుదికొన్న విరహము కుప్పలుగా వేసుకొనె
ముదురుఁ దలపోఁతలు మూటగట్టెను
పొదలుఁ జుట్టరికాలు పుక్కెట నించుకొనె
యెదురు చూచీ నీకు నిట్టె రావయ్యా
(॥ఇంతి॥)
కడలేని యాసలఁ గంకణము గట్టుకొనె
సుడిగొన్న వావులకుఁ జోటిచ్చెను
అడరి శ్రీవేంకటేశ అలమేలుమంగనేలితి -
వెడయక రావయ్య ఇట్టె దినదినము
(||pallavi||)
iṁti nerubulu nīdo nĕṁtani sĕppam̐gavachchu
viṁtalĕllām̐ jūduvu vegamĕ rāvayyā
(||iṁti||)
simmirem̐ge valabulu sĕliya gādĕlam̐bosĕ
vummagilum̐ damagamu nŏḍim̐gaṭṭĕnu
kummariṁpum̐ gorigalu kūḍabĕṭṭugŏni ninnu
rammani piluvanaṁpĕ rāmayya im̐kanu
(||iṁti||)
gudigŏnna virahamu kuppalugā vesugŏnĕ
mudurum̐ dalabom̐talu mūḍagaṭṭĕnu
pŏdalum̐ juṭṭarigālu pukkĕḍa niṁchugŏnĕ
yĕduru sūsī nīgu niṭṭĕ rāvayyā
(||iṁti||)
kaḍaleni yāsalam̐ gaṁkaṇamu gaṭṭugŏnĕ
suḍigŏnna vāvulagum̐ joḍichchĕnu
aḍari śhrīveṁkaḍeśha alamelumaṁganelidi -
vĕḍayaga rāvayya iṭṭĕ dinadinamu