ఇంతేసివారలకంటే నెక్కుడా తాము
(॥పల్లవి॥)
ఇంతేసివారలకంటే నెక్కుడా తాము
సంతతము గోవిందుదాస్యమే మూలధనము
(॥ఇంతేసి॥)
అరసి యెఱుఁగఁడా బ్రహ్మ జ్ఞాన మింద్రుఁడు
సరిలేని వేదాంతము చదువఁడా
హరినే ప్రార్థన చేసి యాపద గడచినాఁడు
యిరవై స్వతంత్రమున యింతా మిథ్య యనెనా
(॥ఇంతేసి॥)
కమలజుఁ డెఱుఁగఁడా కడు బ్రహ్మజ్ఞానము
నెమకి శాస్త్రార్థము నిశ్చయింపఁడా
విమలపు విష్ణు గొల్చి వేదములు వడయఁడా
తమితో నాతఁ డేమైనాఁ దానె బ్రహ్మమనెనా
(॥ఇంతేసి॥)
శివునకు లేదా మించిన బ్రహ్మజ్ఞానము
తవిలి పరతత్వము దలపోయఁడా
జవళి శ్రీవేంకటేశు జపించి వారణాశిలో
రవళి తాఁజెప్పేమంత్రము గల్ల యనెనా
(||pallavi||)
iṁtesivāralagaṁṭe nĕkkuḍā tāmu
saṁtadamu goviṁdudāsyame mūladhanamu
(||iṁtesi||)
arasi yĕṟum̐gam̐ḍā brahma jñāna miṁdrum̐ḍu
sarileni vedāṁtamu saduvam̐ḍā
harine prārdhana sesi yābada gaḍasinām̐ḍu
yiravai svadaṁtramuna yiṁtā mithya yanĕnā
(||iṁtesi||)
kamalajum̐ ḍĕṟum̐gam̐ḍā kaḍu brahmajñānamu
nĕmagi śhāstrārdhamu niśhchayiṁpam̐ḍā
vimalabu viṣhṇu gŏlsi vedamulu vaḍayam̐ḍā
tamido nādam̐ ḍemainām̐ dānĕ brahmamanĕnā
(||iṁtesi||)
śhivunagu ledā miṁchina brahmajñānamu
tavili paradatvamu dalaboyam̐ḍā
javaḽi śhrīveṁkaḍeśhu jabiṁchi vāraṇāśhilo
ravaḽi tām̐jĕppemaṁtramu galla yanĕnā