ఇంతయు నీమాయామయ మేగతిఁ దెలియఁగ వచ్చును
(॥పల్లవి॥)
ఇంతయు నీమాయామయ మేగతిఁ దెలియఁగ వచ్చును
దొంతిఁబెట్టిన కుండలు తొడరిన జన్నములు
(॥ఇంత॥)
కలలోపలి సంభోగము ఘనమగు సంపద లిన్నియు
వలలోపలి నిడిపరులు వన్నెల విభవములు
తలఁపునఁ గలిగియు నిందునే తగులకపో దెవ్వరికిని
తెలిసినఁ దెలియదు యిదివో దేవరహస్యంబు
(॥ఇంత॥)
అద్దములోపలి నీడలు అందరి దేహపురూపులు
చద్దికి వండిన వంటలు జంటఁగర్మములు
పొద్దొకవిధమయి తోఁచును భువి నజ్ఞానాంబుధిలో-
నద్దిన దిది దెలియఁగరా దంబుదముల మెఱుఁగు
(॥ఇంత॥)
మనసునఁ దాగినపా లివి మదిఁగల కోరిక లిన్నియు
యినుమున నిగిరిననీళ్లు యిల నాహారములు
పనివడి శ్రీవేంకటగిరిపతి నీదాసు లివిన్నియు
కని మని విడిచిన మనుజుల కాయపు మర్మములు
(||pallavi||)
iṁtayu nīmāyāmaya megadim̐ dĕliyam̐ga vachchunu
dŏṁtim̐bĕṭṭina kuṁḍalu tŏḍarina jannamulu
(||iṁta||)
kalalobali saṁbhogamu ghanamagu saṁpada linniyu
valalobali niḍibarulu vannĕla vibhavamulu
talam̐punam̐ galigiyu niṁdune tagulagabo dĕvvarigini
tĕlisinam̐ dĕliyadu yidivo devarahasyaṁbu
(||iṁta||)
addamulobali nīḍalu aṁdari dehaburūbulu
saddigi vaṁḍina vaṁṭalu jaṁṭam̐garmamulu
pŏddŏgavidhamayi tom̐sunu bhuvi najñānāṁbudhilo-
naddina didi dĕliyam̐garā daṁbudamula mĕṟum̐gu
(||iṁta||)
manasunam̐ dāginabā livi madim̐gala koriga linniyu
yinumuna nigirinanīḽlu yila nāhāramulu
panivaḍi śhrīveṁkaḍagiribadi nīdāsu livinniyu
kani mani viḍisina manujula kāyabu marmamulu