ఇంతకంటె మఱి నీవు యేమి సేతువు
(॥పల్లవి॥)
ఇంతకంటె మఱి నీవు యేమి సేతువు
పంత మారుకో రాదు నా భావము నీ చేతిది
(॥ఇంత॥)
పిలిచితే నాలికపైఁ బెనగొని వున్నాఁడవు
తలఁచితే మదిలోన దక్కి వుందువు
యెలమిఁ జాచితే కన్నులెదుటనే వున్నాఁడవు
కొలచి బ్రతికేవారికొలఁది భాగ్య మిఁకను
(॥ఇంత॥)
చేరి నిన్నుఁబూజించితే చేతిలో నున్నాఁడవు
ఆరగించుమంటే కళ్లందుకొందువు
నేరుపుతో మొక్కుకొంటే నీపై భక్తి చేకొందువు
కూరిమిఁ గొలిచే వివేకుల భాగ్య మిఁకను
(॥ఇంత॥)
సత్తుగాఁ జదివితేను చదువలందున్నాఁడవు
వొత్తి నిన్నుఁ బొగడితే వొద్ద నుందువు
హత్తి శ్రీవేంకటేశ అలమేల్మంగపతిని
చిత్తము రా సేవించే జీవుల భాగ్య మిఁకను
(||pallavi||)
iṁtagaṁṭĕ maṟi nīvu yemi seduvu
paṁta mārugo rādu nā bhāvamu nī sedidi
(||iṁta||)
piliside nāligabaim̐ bĕnagŏni vunnām̐ḍavu
talam̐side madilona dakki vuṁduvu
yĕlamim̐ jāside kannulĕduḍane vunnām̐ḍavu
kŏlasi bradigevārigŏlam̐di bhāgya mim̐kanu
(||iṁta||)
seri ninnum̐būjiṁchide sedilo nunnām̐ḍavu
āragiṁchumaṁṭe kaḽlaṁdugŏṁduvu
nerubudo mŏkkugŏṁṭe nībai bhakti segŏṁduvu
kūrimim̐ gŏlise vivegula bhāgya mim̐kanu
(||iṁta||)
sattugām̐ jadividenu saduvalaṁdunnām̐ḍavu
vŏtti ninnum̐ bŏgaḍide vŏdda nuṁduvu
hatti śhrīveṁkaḍeśha alamelmaṁgabadini
sittamu rā seviṁche jīvula bhāgya mim̐kanu