ఇంతటిది గావలదా యింతి యైతేను
(॥పల్లవి॥)
ఇంతటిది గావలదా యింతి యైతేను
కాంతునిఁ గళ లంటి కరఁగించె నిపుడు
(॥ఇంత॥)
అలిగి వచ్చినపతి నలమి కాఁగిట నెత్తి
పలుకుల వినయాలు పచరించఁగా
సొలసి కోపాన నాఁటఁ జూచె విభుఁ డంతలోనె
చెలియ చెమట గోరఁ జిమ్మెఁబో కన్నులనూ
(॥ఇంత॥)
మక్కువ మంకులతోడ మాటలాడకున్న పతి
చెక్కు నొక్కి జలజాక్షి సేద దేర్చఁగా
వెక్కసము లాడెటి విభుని వదనమున
పుక్కిటి తమ్ముల మిడి పొలిఁతి వాలించెనే
(॥ఇంత॥)
పంతపు శ్రీవెంకటేశుఁ బడఁతి వొయ్యనె చేరి
అంతరంగ మెల్ల దేర్చి యాదరించఁగా
రంతుతో రతుల నిబ్బరము చూపె నాతఁడును
మంతనానఁ జొక్కించి మఱపించె మేనూ
(||pallavi||)
iṁtaḍidi gāvaladā yiṁti yaidenu
kāṁtunim̐ gaḽa laṁṭi karam̐giṁchĕ nibuḍu
(||iṁta||)
aligi vachchinabadi nalami kām̐giḍa nĕtti
palugula vinayālu pasariṁcham̐gā
sŏlasi kobāna nām̐ṭam̐ jūsĕ vibhum̐ ḍaṁtalonĕ
sĕliya sĕmaḍa goram̐ jimmĕm̐bo kannulanū
(||iṁta||)
makkuva maṁkuladoḍa māḍalāḍagunna padi
sĕkku nŏkki jalajākṣhi seda dersam̐gā
vĕkkasamu lāḍĕḍi vibhuni vadanamuna
pukkiḍi tammula miḍi pŏlim̐ti vāliṁchĕne
(||iṁta||)
paṁtabu śhrīvĕṁkaḍeśhum̐ baḍam̐ti vŏyyanĕ seri
aṁtaraṁga mĕlla dersi yādariṁcham̐gā
raṁtudo radula nibbaramu sūbĕ nādam̐ḍunu
maṁtanānam̐ jŏkkiṁchi maṟabiṁchĕ menū