ఇంతటి నీ చేఁతలు నే మెరిఁగితే నేమాయ
(॥పల్లవి॥)
ఇంతటి నీ చేఁతలు నే మెరిఁగితే నేమాయ
వింతవారమా నీకు వెఱ పేల నేఁడు
(॥ఇంత॥)
యింతి నీకడకు వచ్చె నిట్టె నీచేఁతలు మెచ్చె
మంతనాన నీకు నిట్టె మన సిచ్చెను
యెంత లేదు నీసంతోస మే మని చెప్పుదు నిఁక
చెంతల నామోము చడ సిగ్గేల నీకు
(॥ఇంత॥)
వనిత నీకు మొక్కె వలపులు దల కెక్కె
చెనకులకే నీచేతఁ జిక్కెను
ఘన మాయ నీవేడుక కళ లెట్టు పొగడుదు
ననువుల నామాఁటకు నవ్వు లేల నీకు
(॥ఇంత॥)
అంగన మోహము నించె నాయములు గరఁగించె
యింగితాన నీపంత మిచ్చగించెను
సంగతి శ్రీవేంకటేశ సరి నన్నుఁ గూడితివి
యెంగిలిమోవినే యెలయింపు లేల నీకు
(||pallavi||)
iṁtaḍi nī sem̐talu ne mĕrim̐gide nemāya
viṁtavāramā nīgu vĕṟa pela nem̐ḍu
(||iṁta||)
yiṁti nīgaḍagu vachchĕ niṭṭĕ nīsem̐talu mĕchchĕ
maṁtanāna nīgu niṭṭĕ mana sichchĕnu
yĕṁta ledu nīsaṁtosa me mani sĕppudu nim̐ka
sĕṁtala nāmomu saḍa siggela nīgu
(||iṁta||)
vanida nīgu mŏkkĕ valabulu dala kĕkkĕ
sĕnagulage nīsedam̐ jikkĕnu
ghana māya nīveḍuga kaḽa lĕṭṭu pŏgaḍudu
nanuvula nāmām̐ṭagu navvu lela nīgu
(||iṁta||)
aṁgana mohamu niṁchĕ nāyamulu garam̐giṁchĕ
yiṁgidāna nībaṁta michchagiṁchĕnu
saṁgadi śhrīveṁkaḍeśha sari nannum̐ gūḍidivi
yĕṁgilimovine yĕlayiṁpu lela nīgu