ఇంత జాణవు గాఁగానే యింతులు వలచిరి
(॥పల్లవి॥)
ఇంత జాణవు గాఁగానే యింతులు వలచిరి
సంతోసించి రీడనున్న సతులెల్లా నిన్నును
(॥ఇంత॥)
ఆయములెత్తి యాడి యతివ నన్ను దూరితే
చాయగా పాటుసేసుకొని సారె నవ్వేవు
నీయందు నేరాలు మోపి నీకుఁ దారుకాణించితే
యీయకోలు సేసుకొని ఇచ్చగించేవు
(॥ఇంత॥)
వొల్లనే యానలు వెట్టవొద్దని పెనఁగితేను
చెల్లుబడిసేసుకొని చేయివట్టేవు
పల్లదాన వెంగేలకు పలుమారు మొక్కితేను
వెల్లవిరిసేసుకొని వేడుకపడేవు
(॥ఇంత॥)
అందరిలో నిమ్మపంట నట్టె నిన్ను వేసితేను
చందములుసేసుకొని సమ్మతించేవు
కందువ శ్రీవేంకటేశ కలికి నిన్నొరసితే
చెందెకూడి యదే గురిసేసుకొనేవు
(||pallavi||)
iṁta jāṇavu gām̐gāne yiṁtulu valasiri
saṁtosiṁchi rīḍanunna sadulĕllā ninnunu
(||iṁta||)
āyamulĕtti yāḍi yadiva nannu dūride
sāyagā pāḍusesugŏni sārĕ navvevu
nīyaṁdu nerālu mobi nīgum̐ dārugāṇiṁchide
yīyagolu sesugŏni ichchagiṁchevu
(||iṁta||)
vŏllane yānalu vĕṭṭavŏddani pĕnam̐gidenu
sĕllubaḍisesugŏni seyivaṭṭevu
palladāna vĕṁgelagu palumāru mŏkkidenu
vĕllavirisesugŏni veḍugabaḍevu
(||iṁta||)
aṁdarilo nimmabaṁṭa naṭṭĕ ninnu vesidenu
saṁdamulusesugŏni sammadiṁchevu
kaṁduva śhrīveṁkaḍeśha kaligi ninnŏraside
sĕṁdĕgūḍi yade gurisesugŏnevu