ఇంకనేలే కొంక నీకు ఇద్దరముఁ గూడితిమి
(॥పల్లవి॥)
ఇంకనేలే కొంక నీకు ఇద్దరముఁ గూడితిమి
అంకెకు వచ్చినట్టెల్లా నందువు గాక
(॥ఇంక॥)
పంతము నెరపనేల పలుమారు నీతోడ
చింతదీర నేమైనాఁ జేతువుగాక
వింతవా రెవ్వరున్నారు వీరిందరిలో నీకు
అంతరంగములో మాటలాడుదువుగాక
(॥ఇంక॥)
సన్నల జంకించనేల సమ్మతించినపనికి
వెన్నెలవలపు నాపై వేతువుగాక
కన్నులనాజంకెనలు కదిసి నిన్నేమిసేసీ
మన్ననలన్నియు నాపై మక్కళింతుగాక
(॥ఇంక॥)
కందువలు చెప్పనేల కైకొని కూడితిని
పొందికలు మాకు నేరుపుదుగాక
యిందులోన శ్రీ వేంకటేశ నీకు మఱఁగేది
చెందినట్లనే దయసేతువుగాక
(||pallavi||)
iṁkanele kŏṁka nīgu iddaramum̐ gūḍidimi
aṁkĕgu vachchinaṭṭĕllā naṁduvu gāga
(||iṁka||)
paṁtamu nĕrabanela palumāru nīdoḍa
siṁtadīra nemainām̐ jeduvugāga
viṁtavā rĕvvarunnāru vīriṁdarilo nīgu
aṁtaraṁgamulo māḍalāḍuduvugāga
(||iṁka||)
sannala jaṁkiṁchanela sammadiṁchinabanigi
vĕnnĕlavalabu nābai veduvugāga
kannulanājaṁkĕnalu kadisi ninnemisesī
mannanalanniyu nābai makkaḽiṁtugāga
(||iṁka||)
kaṁduvalu sĕppanela kaigŏni kūḍidini
pŏṁdigalu māgu nerubudugāga
yiṁdulona śhrī veṁkaḍeśha nīgu maṟam̐gedi
sĕṁdinaṭlane dayaseduvugāga