ఇందులోనఁ దప్పులేవి యేల నన్ను దూరేవు
(॥పల్లవి॥)
ఇందులోనఁ దప్పులేవి యేల నన్ను దూరేవు
నందనందనుఁడ నాలో నవ్వితి నేను
(॥ఇందు॥)
ఆమనిగా నిందాఁకా ఆపెమాఁటలా, డిప్పుడు
నామాఁట లాడఁగాను నవ్వితినేను
జాముదాఁక ఆపె దిక్కు సంతోసానఁ, జూచి చూచి
నామోము చూడఁగాను నవ్వితి నేను
(॥ఇందు॥)
పోయిన రాతిరి యెల్లా పొరుగింటి కాడ నుండి
నా యింటికి రాఁగాను నవ్వితి నేను
చాయల కాపె సుద్దులు సతులచేఁ దడవించి
నాయాలు నీవు చెప్పఁగా నవ్వితి నేను
(॥ఇందు॥)
అడరి శ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను
నడుమ నీవు గూడఁగా నవ్వితి నేను
యెడపుల యాపెఁ దచ్చి యిట్టె నాకు మొక్కించఁగా
నడవడి చూచి నిన్ను నవ్వితి నేను
(||pallavi||)
iṁdulonam̐ dappulevi yela nannu dūrevu
naṁdanaṁdanum̐ḍa nālo navvidi nenu
(||iṁdu||)
āmanigā niṁdām̐kā ābĕmām̐ṭalā, ḍippuḍu
nāmām̐ṭa lāḍam̐gānu navvidinenu
jāmudām̐ka ābĕ dikku saṁtosānam̐, jūsi sūsi
nāmomu sūḍam̐gānu navvidi nenu
(||iṁdu||)
poyina rādiri yĕllā pŏrugiṁṭi kāḍa nuṁḍi
nā yiṁṭigi rām̐gānu navvidi nenu
sāyala kābĕ suddulu sadulasem̐ daḍaviṁchi
nāyālu nīvu sĕppam̐gā navvidi nenu
(||iṁdu||)
aḍari śhrī veṁkaḍeśha alamelumaṁga nenu
naḍuma nīvu gūḍam̐gā navvidi nenu
yĕḍabula yābĕm̐ dachchi yiṭṭĕ nāgu mŏkkiṁcham̐gā
naḍavaḍi sūsi ninnu navvidi nenu