ఇందు సాధించని యర్థ మెందును సాధింపరాదు
(॥పల్లవి॥)
ఇందు సాధించని యర్థ మెందును సాధింపరాదు
పొందుగా పంచాశత్కోటిభూమండలమునా
(॥ఇందు॥)
యెక్కుడు పాపమైతేను హీనజంతువై హితము
మిక్కిలి పుణ్యమైతేను మించి దేవుఁడై జనించు
దిక్కుల రెండు సరియైతే మనుష్యజన్మమౌను
చక్కగా నిందునే ముక్తి సాధించవలయు
(॥ఇందు॥)
మెఱసి బాల్యమునందు మిక్కిలి బుద్ధి వుట్టదు
మఱి వార్థకమైతేను మందబుద్ధితో నుండు
తఱిఁ బ్రౌఢవయసున తగు వివేకము పుట్టు
నెఱి నిండేసుజ్ఞానము నిశ్చయింపవలయు
(॥ఇందు॥)
కాంతల భ్రమ బడితే కడు మత్తుఁడై యుండు
అంత ధనకాంక్షలైతే నలమట నలసు
సంతతవిరక్తియైతే సర్వార్థములుఁ జేరు
యెంతైనా యిందే శ్రీవేంకటేశుఁ గొల్వవలయు
(||pallavi||)
iṁdu sādhiṁchani yardha mĕṁdunu sādhiṁparādu
pŏṁdugā paṁchāśhatkoḍibhūmaṁḍalamunā
(||iṁdu||)
yĕkkuḍu pābamaidenu hīnajaṁtuvai hidamu
mikkili puṇyamaidenu miṁchi devum̐ḍai janiṁchu
dikkula rĕṁḍu sariyaide manuṣhyajanmamaunu
sakkagā niṁdune mukti sādhiṁchavalayu
(||iṁdu||)
mĕṟasi bālyamunaṁdu mikkili buddhi vuṭṭadu
maṟi vārdhagamaidenu maṁdabuddhido nuṁḍu
taṟim̐ brauḍhavayasuna tagu vivegamu puṭṭu
nĕṟi niṁḍesujñānamu niśhchayiṁpavalayu
(||iṁdu||)
kāṁtala bhrama baḍide kaḍu mattum̐ḍai yuṁḍu
aṁta dhanagāṁkṣhalaide nalamaḍa nalasu
saṁtadaviraktiyaide sarvārdhamulum̐ jeru
yĕṁtainā yiṁde śhrīveṁkaḍeśhum̐ gŏlvavalayu