ఇందు రమ్మంటేఁ జాలు నింటిలోనికే వత్తువు
(॥పల్లవి॥)
ఇందు రమ్మంటేఁ జాలు నింటిలోనికే వత్తువు
సందడిఁ గాలు దొక్క జాణవుగా నీవు
(॥ఇందు॥)
కానీరా ని న్నెవ్వతె దగ్గరినాను వేగిరిమే
మేనబావ వవుదువు మేలుగా నీవు
మోనమున నూరకైనా మోము చూచితేఁ జాలు
మేనిపైఁ జేయి వేసేవు మేలుగా నీవు
(॥ఇందు॥)
మొక్కలాన నెవ్వతైనా మొకమోడితేఁ జాలు
మిక్కిలి నవ్వ వత్తువు మేలుగా నీవు
గుక్కక ని న్నేపాటైనాఁ గూచుండు మంటేఁ జాలు
మిక్కుటమై తొ డెక్కుదు మేలుగా నీవు
(॥ఇందు॥)
చాటువ నిన్ను మెచ్చితేఁ జాలు నదే సందుగాఁగ
మీటుగాఁ గౌఁగిలింతువు మేలుగా నీవు
నీటున శ్రీవేంకటేశ నే నలమేల్మంగను
మేటివై కలసితివి మేలుగా నీవు
(||pallavi||)
iṁdu rammaṁṭem̐ jālu niṁṭilonige vattuvu
saṁdaḍim̐ gālu dŏkka jāṇavugā nīvu
(||iṁdu||)
kānīrā ni nnĕvvadĕ daggarinānu vegirime
menabāva vavuduvu melugā nīvu
monamuna nūragainā momu sūsidem̐ jālu
menibaim̐ jeyi vesevu melugā nīvu
(||iṁdu||)
mŏkkalāna nĕvvadainā mŏgamoḍidem̐ jālu
mikkili navva vattuvu melugā nīvu
gukkaga ni nnebāḍainām̐ gūsuṁḍu maṁṭem̐ jālu
mikkuḍamai tŏ ḍĕkkudu melugā nīvu
(||iṁdu||)
sāḍuva ninnu mĕchchidem̐ jālu nade saṁdugām̐ga
mīḍugām̐ gaum̐giliṁtuvu melugā nīvu
nīḍuna śhrīveṁkaḍeśha ne nalamelmaṁganu
meḍivai kalasidivi melugā nīvu