ఇల్లాలైనదానికి యివి గుణాలా
(॥పల్లవి॥)
ఇల్లాలైనదానికి యివి గుణాలా
మెల్లనె గుట్టుతోడనె మెరతురు గాక
(॥ఇల్లా॥)
కాతరించి సారె సారెఁ గడు సరసమాడేవు
ఆతనికి నీవు దొల్లి ఆలవా యేమి
యేతుల మాటలాడి యిట్టె నవ్వించేవతని
జాతిక ర్తవా నీవు జాణతనాలాడను
(॥ఇల్లా॥)
సముకాన నీవిట్టే చనవులు నెరుపేవు
తమితోడఁ బోరానిచుట్టుమవా యేమి
చెమటలు గారఁగాను సేవలెల్లాఁ జేసేవు
అమరఁగ నూడిగపు అంగనవా యీడను
(॥ఇల్లా॥)
పతివద్దనందరికి పనులెల్లాఁ జెప్పేవు
సతతమునదికారిసానివా నీవు
తతి శ్రీ వెంకటేశుఁడు తగ నన్నుఁ గూడె నేఁడు
కతకారిదానవా చక్కటులు చెప్పఁగను
(||pallavi||)
illālainadānigi yivi guṇālā
mĕllanĕ guṭṭudoḍanĕ mĕraduru gāga
(||illā||)
kādariṁchi sārĕ sārĕm̐ gaḍu sarasamāḍevu
ādanigi nīvu dŏlli ālavā yemi
yedula māḍalāḍi yiṭṭĕ navviṁchevadani
jādiga rdavā nīvu jāṇadanālāḍanu
(||illā||)
samugāna nīviṭṭe sanavulu nĕrubevu
tamidoḍam̐ borānisuṭṭumavā yemi
sĕmaḍalu gāram̐gānu sevalĕllām̐ jesevu
amaram̐ga nūḍigabu aṁganavā yīḍanu
(||illā||)
padivaddanaṁdarigi panulĕllām̐ jĕppevu
sadatamunadigārisānivā nīvu
tadi śhrī vĕṁkaḍeśhum̐ḍu taga nannum̐ gūḍĕ nem̐ḍu
kadagāridānavā sakkaḍulu sĕppam̐ganu