(॥పల్లవి॥)
ఇద్దరి వసంతము లీడేరెను
వుద్దండాలు మాని ఇంక నూరకుండరాదా
(॥॥)
కామిను లిందరు నిన్నుఁ గాఁగిటఁ బెట్టుకుండఁగా
నీమీఁదఁ జెల్లెఁ గా పన్నీరు చెలి
యేమరించి విడిపించు కేతెంచి నీవాకె-
కోమలపుఁజన్నులపై కుంకుమ చల్లితివి
(॥॥)
వూడిగాలవారిచేత నొంటి నడెవెట్టించి
జాడతోఁ గప్పురధూళి చల్లెఁగా నీపై
వోడక నీవప్పటిని వొడ్డి తప్పించుక కొప్పు
వీడఁగా నాపెమీఁద విరుల వేసితివి
(॥॥)
దొమ్మి నడపాలవారి దోమతెర వేయుమని
చిమ్మెఁగా గందము నీపై శ్రీ వేంకటేశ
యెమ్మెతో నీకెఁ గూడి ఇంపులచెమటలకు
కమ్మరఁ గమ్మర నట్టె కస్తూరి నించితివి
(||pallavi||)
iddari vasaṁtamu līḍerĕnu
vuddaṁḍālu māni iṁka nūraguṁḍarādā
(||||)
kāminu liṁdaru ninnum̐ gām̐giḍam̐ bĕṭṭuguṁḍam̐gā
nīmīm̐dam̐ jĕllĕm̐ gā pannīru sĕli
yemariṁchi viḍibiṁchu kedĕṁchi nīvāgĕ-
komalabum̐jannulabai kuṁkuma sallidivi
(||||)
vūḍigālavāriseda nŏṁṭi naḍĕvĕṭṭiṁchi
jāḍadom̐ gappuradhūḽi sallĕm̐gā nībai
voḍaga nīvappaḍini vŏḍḍi tappiṁchuga kŏppu
vīḍam̐gā nābĕmīm̐da virula vesidivi
(||||)
dŏmmi naḍabālavāri domadĕra veyumani
simmĕm̐gā gaṁdamu nībai śhrī veṁkaḍeśha
yĕmmĕdo nīgĕm̐ gūḍi iṁpulasĕmaḍalagu
kammaram̐ gammara naṭṭĕ kastūri niṁchidivi