ఎవ్వరు నెరగరంటా యేల బొంకేరు
(॥పల్లవి॥)
ఎవ్వరు నెరగరంటా యేల బొంకేరు
నవ్వేరు మిమ్ముఁ జూచి నలినాక్షులెల్లను
(॥॥)
చెలియనుదుటిమీఁది చిన్నారికస్తూరిబొట్టు
చెలువుమీరఁగ నీచెక్కుల నంటె
నిలువునామము నీది నెలఁతనుదుట నంటె
తలకొన్నగురుతులు తారుమారులాయను
(॥॥)
కాంతకన్నులఁ బెట్టినకాటుకెల్లా నీమోవి-
వింతబాగులై నేఁడు వెలశున్నది
రంతుల నీబాహుపురి రమణిసందిటఁ జిక్కె
యింతలోనే మీచేఁత లివ్వ లవ్వలాయను
(॥॥)
సరి నలమేల్మంగ చరణముల లత్తుక
సొరిది నీవురమునఁ జూపట్టెను
గరిమ శ్రీ వేంకటేశ కౌస్తుభ మింతికి సొమ్మై
దొరసె మీవలపులు తోడునీడలాయను
(||pallavi||)
ĕvvaru nĕragaraṁṭā yela bŏṁkeru
navveru mimmum̐ jūsi nalinākṣhulĕllanu
(||||)
sĕliyanuduḍimīm̐di sinnārigastūribŏṭṭu
sĕluvumīram̐ga nīsĕkkula naṁṭĕ
niluvunāmamu nīdi nĕlam̐tanuduḍa naṁṭĕ
talagŏnnagurudulu tārumārulāyanu
(||||)
kāṁtagannulam̐ bĕṭṭinagāḍugĕllā nīmovi-
viṁtabāgulai nem̐ḍu vĕlaśhunnadi
raṁtula nībāhuburi ramaṇisaṁdiḍam̐ jikkĕ
yiṁtalone mīsem̐ta livva lavvalāyanu
(||||)
sari nalamelmaṁga saraṇamula lattuga
sŏridi nīvuramunam̐ jūbaṭṭĕnu
garima śhrī veṁkaḍeśha kaustubha miṁtigi sŏmmai
dŏrasĕ mīvalabulu toḍunīḍalāyanu