ఎవ్వరింక సరి నీకు నేమిటికిని
(॥పల్లవి॥)
ఎవ్వరింక సరి నీకు నేమిటికిని
యివ్వలను నవ్వలను నిద్దరికె తగును
(॥ఎవ్వ॥)
చూపులనె భ్రమయించె సుదతి తనకెమ్మోవి
తీపులనె తేలించె దిష్టముగను
రూపుననె మరిగించి రుచులుగొనె నీవలపు
యీపనులు నేఁడు మీకిద్దరికె తగును
(॥ఎవ్వ॥)
ఆసలనెతమిరేఁచె నతివ దనచిరునవ్వు
మోసులనె మొలపించె మోహమెల్ల
బాసలనె నీచేతి పంతంబు దక్కఁగొనె
యీసుద్దులెల్ల మీయిద్దరికె తగును
(॥ఎవ్వ॥)
అంకెలరతుల గెలిచె నలమేలుమంగ దన
లంకెలనుఁగూడి నిను లాలించెను
వుంకువలు శ్రీవెంకటోత్తముఁడ నీ కొసఁగె
యింకా నిట్ల మీకు నిద్దరికె తగును
(||pallavi||)
ĕvvariṁka sari nīgu nemiḍigini
yivvalanu navvalanu niddarigĕ tagunu
(||ĕvva||)
sūbulanĕ bhramayiṁchĕ sudadi tanagĕmmovi
tībulanĕ teliṁchĕ diṣhṭamuganu
rūbunanĕ marigiṁchi rusulugŏnĕ nīvalabu
yībanulu nem̐ḍu mīgiddarigĕ tagunu
(||ĕvva||)
āsalanĕdamirem̐sĕ nadiva danasirunavvu
mosulanĕ mŏlabiṁchĕ mohamĕlla
bāsalanĕ nīsedi paṁtaṁbu dakkam̐gŏnĕ
yīsuddulĕlla mīyiddarigĕ tagunu
(||ĕvva||)
aṁkĕlaradula gĕlisĕ nalamelumaṁga dana
laṁkĕlanum̐gūḍi ninu lāliṁchĕnu
vuṁkuvalu śhrīvĕṁkaḍottamum̐ḍa nī kŏsam̐gĕ
yiṁkā niṭla mīgu niddarigĕ tagunu