ఎవ్వరికిఁ గలదయ్య యిటువంటి వలపు
(॥పల్లవి॥)
ఎవ్వరికిఁ గలదయ్య యిటువంటి వలపు
పువ్వువంటి పాయమున భోగించీఁ జెలియ
(॥ఎవ్వ॥)
విన్నపాలు నీకుఁ జేసి వెలఁది సిగ్గువడీని
చన్నులమీఁదిపయ్యద జారఁగాను
తన్నుఁ దానె చొక్కుకొంటా తలపోసి లోలోనే
యెన్నిక లెటువంటిదో యేమిభావ మో
(॥ఎవ్వ॥)
చేరి నీపాదము లొత్తి చిరునవ్వు నవ్వీని
ఊరి చెక్కుల చెమట లొలుకఁ గాను
వేరులేనింతోసాల వెనకము దెరఁగదు
కోరిక లెట్టున్నవో గుట్టూఁ దెలియదు
(॥ఎవ్వ॥)
గక్కన విడె మిచ్చి కళలు మోమున నించీ
పుక్కిటినిట్టూర్పులు పొదలఁగాను
యిక్కడ శ్రీవేంకటేశ యేలితి విట్టె యీకెను
దక్కిన దిదెంతమేలో తలపోయరాదు
(||pallavi||)
ĕvvarigim̐ galadayya yiḍuvaṁṭi valabu
puvvuvaṁṭi pāyamuna bhogiṁchīm̐ jĕliya
(||ĕvva||)
vinnabālu nīgum̐ jesi vĕlam̐di sigguvaḍīni
sannulamīm̐dibayyada jāram̐gānu
tannum̐ dānĕ sŏkkugŏṁṭā talabosi lolone
yĕnniga lĕḍuvaṁṭido yemibhāva mo
(||ĕvva||)
seri nībādamu lŏtti sirunavvu navvīni
ūri sĕkkula sĕmaḍa lŏlugam̐ gānu
veruleniṁtosāla vĕnagamu dĕram̐gadu
koriga lĕṭṭunnavo guṭṭūm̐ dĕliyadu
(||ĕvva||)
gakkana viḍĕ michchi kaḽalu momuna niṁchī
pukkiḍiniṭṭūrbulu pŏdalam̐gānu
yikkaḍa śhrīveṁkaḍeśha yelidi viṭṭĕ yīgĕnu
dakkina didĕṁtamelo talaboyarādu