ఎట్టిదో మీమాయావిలాసము యెఱిఁగిన నెఱఁగనీదు
(॥పల్లవి॥)
ఎట్టిదో మీమాయావిలాసము యెఱిఁగిన నెఱఁగనీదు
అట్టె మాగురు ననుమతినే ప్రత్యక్షమవైతివి గాని
(॥ఎట్టి॥)
కరుణాకరా మిమ్మునుఁ గని తెలియఁగలేను
ధర మీమహిమలు వినివిని తగ నరుదందుదును
నరహరి నీవు నాలో నుండఁగ నమ్మక పురాణకథలందు
అరయఁగ మీచరితలు చెప్పఁగ నాసతోడ మిముఁ దలంతును
(॥ఎట్టి॥)
జగదీశా మీనామంబులు జపించ నలయుదును
వెగటుగ నీచిత్రసృష్టి చూచి మిము వెదకుదు నింతటను
నగధర మీపై భక్తి సేయఁగ మనంబున వొడఁబడను
పగటున మీరిచ్చు వరములకొరకే పలుమారు మీకు మెుక్కుకొందును
(॥ఎట్టి॥)
శ్రీవేంకటేశా నీమూరితి చింతించి చేపట్టఁగలేను
దేవుఁడ వనియెడు విశ్వాసమునకే తిరముగఁ గొలిచెదను
శ్రీవనితాధిప వేదాలు మిమ్మునుఁ జెప్పఁగా నే తర్కింపుదును
వేవేలు పరుషలు సేవింపఁగ నీవే కర్తవని నిశ్చయింతును
(||pallavi||)
ĕṭṭido mīmāyāvilāsamu yĕṟim̐gina nĕṟam̐ganīdu
aṭṭĕ māguru nanumadine pratyakṣhamavaidivi gāni
(||ĕṭṭi||)
karuṇāgarā mimmunum̐ gani tĕliyam̐galenu
dhara mīmahimalu vinivini taga narudaṁdudunu
narahari nīvu nālo nuṁḍam̐ga nammaga purāṇagathalaṁdu
arayam̐ga mīsaridalu sĕppam̐ga nāsadoḍa mimum̐ dalaṁtunu
(||ĕṭṭi||)
jagadīśhā mīnāmaṁbulu jabiṁcha nalayudunu
vĕgaḍuga nīsitrasṛṣhṭi sūsi mimu vĕdagudu niṁtaḍanu
nagadhara mībai bhakti seyam̐ga manaṁbuna vŏḍam̐baḍanu
pagaḍuna mīrichchu varamulagŏrage palumāru mīgu mĕుkkugŏṁdunu
(||ĕṭṭi||)
śhrīveṁkaḍeśhā nīmūridi siṁtiṁchi sebaṭṭam̐galenu
devum̐ḍa vaniyĕḍu viśhvāsamunage tiramugam̐ gŏlisĕdanu
śhrīvanidādhiba vedālu mimmunum̐ jĕppam̐gā ne targiṁpudunu
vevelu paruṣhalu seviṁpam̐ga nīve kardavani niśhchayiṁtunu