ఎట్టి యాసోదకాఁడవు యెందరికి నోపుదువు
(॥పల్లవి॥)
ఎట్టి యాసోదకాఁడవు యెందరికి నోపుదువు
నెట్టుకొన్న మేలు కాపె నిలుచుక వున్నది
(॥॥)
సందడి నందరితోడ సరసాలాడే వీడ
కందువకు వచ్చినాపె కాచుకున్నది
పొందుల పొరగులను పొత్తులకడందుకోఁగా
విందు చెప్పవచ్చినాపె వెరగుతో నున్నది
(॥॥)
వాడవారిపై నీవు వసంతాలు చల్లేవు
వీడె మంపినాపె లోనిమేడ నున్నది
గోడ నిక్కి చూచినాపె గుబ్బలు నీ వంటఁగాను
జోడు గూడ వచ్చినాపె చూచి నవ్వుచున్నది
(॥॥)
కొలువులో వారినెల్లా కూడఁగ సన్న సేసేవు
అలమి పట్టుకున్నాపె అలశున్నది
యెలమి శ్రీవేంకటేశ యిట్టే నన్నుఁ గూడితివి
కలసిన పురమాపె కడు మెచ్చుచున్నది
(||pallavi||)
ĕṭṭi yāsodagām̐ḍavu yĕṁdarigi nobuduvu
nĕṭṭugŏnna melu kābĕ nilusuga vunnadi
(||||)
saṁdaḍi naṁdaridoḍa sarasālāḍe vīḍa
kaṁduvagu vachchinābĕ kāsugunnadi
pŏṁdula pŏragulanu pŏttulagaḍaṁdugom̐gā
viṁdu sĕppavachchinābĕ vĕragudo nunnadi
(||||)
vāḍavāribai nīvu vasaṁtālu sallevu
vīḍĕ maṁpinābĕ lonimeḍa nunnadi
goḍa nikki sūsinābĕ gubbalu nī vaṁṭam̐gānu
joḍu gūḍa vachchinābĕ sūsi navvusunnadi
(||||)
kŏluvulo vārinĕllā kūḍam̐ga sanna sesevu
alami paṭṭugunnābĕ alaśhunnadi
yĕlami śhrīveṁkaḍeśha yiṭṭe nannum̐ gūḍidivi
kalasina puramābĕ kaḍu mĕchchusunnadi