ఎన్నికై శ్రీవేంకటేశుఁ డితడు గలుగఁగానె
(॥పల్లవి॥)
ఎన్నికై శ్రీవేంకటేశుఁ డితడు గలుగఁగానె
అన్నిటా నందరిలోని అజ్ఞానాలుఁ బాసెను
(॥ఎన్ని॥)
సకలశాస్త్రములందు సందేహమే కాని
వొకరు దైవమహిమ కొడఁబడరు
అకటా బాస చేసినయందుకైనా నమ్మరు
వికలచిత్తులెల్లాను విష్ణుదాస్యమునకు
(॥ఎన్ని॥)
గక్కనఁ గర్మము చేసి కడు నలయుటే కాని
వొక్కమాటు హరిఁ బాడ నొడఁబడరు
తక్కక పెద్దలుగాఁగ తల వణఁకుటే కాని
పుక్కటికాండ్లు హరిఁ బూజించనేరరు
(॥ఎన్ని॥)
చిత్తములో వివేకించి చింతఁ బొరలుటే కాని
వొత్తి హరిపై భార మొప్పగించరు
హత్తిన శ్రీవేంకటేశుఁ డటె దయ దలఁచఁగా
మత్తిలి ప్రపన్నులెల్లా మరేమిటాఁ దప్పరు
(||pallavi||)
ĕnnigai śhrīveṁkaḍeśhum̐ ḍidaḍu galugam̐gānĕ
anniḍā naṁdariloni ajñānālum̐ bāsĕnu
(||ĕnni||)
sagalaśhāstramulaṁdu saṁdehame kāni
vŏgaru daivamahima kŏḍam̐baḍaru
agaḍā bāsa sesinayaṁdugainā nammaru
vigalasittulĕllānu viṣhṇudāsyamunagu
(||ĕnni||)
gakkanam̐ garmamu sesi kaḍu nalayuḍe kāni
vŏkkamāḍu harim̐ bāḍa nŏḍam̐baḍaru
takkaga pĕddalugām̐ga tala vaṇam̐kuḍe kāni
pukkaḍigāṁḍlu harim̐ būjiṁchaneraru
(||ĕnni||)
sittamulo vivegiṁchi siṁtam̐ bŏraluḍe kāni
vŏtti haribai bhāra mŏppagiṁcharu
hattina śhrīveṁkaḍeśhum̐ ḍaḍĕ daya dalam̐sam̐gā
mattili prabannulĕllā maremiḍām̐ dapparu