ఎంతని చెప్పేము నీకు యింతి నీపైఁగల బత్తి
(॥పల్లవి॥)
ఎంతని చెప్పేము నీకు యింతి నీపైఁగల బత్తి
చెంత నీవే చూతువు విచ్చేయవయ్యా ఇంటికి
(॥ఎంత॥)
తరుణి నీరూపము తలపోసితలపోసి
శిరసూఁచి మెచ్చిమెచ్చి చెంగలించును
గరమ నీవిచ్చినవుంగరము తప్పకచూచి
మరిగి సంతోసాన మనసు గరఁగును
(॥ఎంత॥)
చెలులచే నీసుద్దులు చెవులారా వినివిని
సెలవుల నవ్వినవ్వి చిమ్మిరేఁగును
మెలుపున నీవంపినచిలుకతో మాటలాడి
వెలలేనివేడుకల విఱ్ఱవీఁగును
(॥ఎంత॥)
వేసరక నీరాకకు వేళగాఁచి వేళగాఁచి
ఆసలనే చొక్కిచొక్కి యానందించును
సేసవెట్టి కూడితివి శ్రీవేంకటేశ యింతలో
వాసితో నీరతికేలి వరుసఁ బొగడును
(||pallavi||)
ĕṁtani sĕppemu nīgu yiṁti nībaim̐gala batti
sĕṁta nīve sūduvu vichcheyavayyā iṁṭigi
(||ĕṁta||)
taruṇi nīrūbamu talabosidalabosi
śhirasūm̐si mĕchchimĕchchi sĕṁgaliṁchunu
garama nīvichchinavuṁgaramu tappagasūsi
marigi saṁtosāna manasu garam̐gunu
(||ĕṁta||)
sĕlulase nīsuddulu sĕvulārā vinivini
sĕlavula navvinavvi simmirem̐gunu
mĕlubuna nīvaṁpinasilugado māḍalāḍi
vĕlaleniveḍugala viṭravīm̐gunu
(||ĕṁta||)
vesaraga nīrāgagu veḽagām̐si veḽagām̐si
āsalane sŏkkisŏkki yānaṁdiṁchunu
sesavĕṭṭi kūḍidivi śhrīveṁkaḍeśha yiṁtalo
vāsido nīradigeli varusam̐ bŏgaḍunu