ఎంత భ్రమలఁ బెట్టేవే ఇతని నీవు
(॥పల్లవి॥)
ఎంత భ్రమలఁ బెట్టేవే ఇతని నీవు
దొంతుల నీ యానలు తోయఁజాలఁడు
(॥ఎంత॥)
జిగిఁ జెక్కుచేత నీవు చిరునవ్వు నవ్వఁగానె
మగిడి మగిడి పతి మాఁటలాడీని
మొగము చూచి నీవు ముంచి యాస లియ్యఁగానె
తగిలి నీమాట లిట్టె దాఁటఁజాలఁడు
(॥ఎంత॥)
పెక్కు విధముల నీవు ప్రియములు చెప్పఁగానె
అక్కరతో రెప్పలువేయక చూచీని
లక్కవలెఁ గరఁచి విలాసాలు నీవు చూపఁగ
వెక్కసపునీపొందు విడువఁగఁజాలఁడు
(॥ఎంత॥)
వేడుకతోడుత నిట్టె విడెము నీ కియ్యఁగానె
కూడి శ్రీవేంకటేశుఁడు గోర నొత్తీని
యేడఁజూచినాను నీవే ఇచ్చకములాడఁగానే
జాడ నురమెక్కించి దించఁగఁజాలఁడు
(||pallavi||)
ĕṁta bhramalam̐ bĕṭṭeve idani nīvu
dŏṁtula nī yānalu toyam̐jālam̐ḍu
(||ĕṁta||)
jigim̐ jĕkkuseda nīvu sirunavvu navvam̐gānĕ
magiḍi magiḍi padi mām̐ṭalāḍīni
mŏgamu sūsi nīvu muṁchi yāsa liyyam̐gānĕ
tagili nīmāḍa liṭṭĕ dām̐ṭam̐jālam̐ḍu
(||ĕṁta||)
pĕkku vidhamula nīvu priyamulu sĕppam̐gānĕ
akkarado rĕppaluveyaga sūsīni
lakkavalĕm̐ garam̐si vilāsālu nīvu sūbam̐ga
vĕkkasabunībŏṁdu viḍuvam̐gam̐jālam̐ḍu
(||ĕṁta||)
veḍugadoḍuda niṭṭĕ viḍĕmu nī kiyyam̐gānĕ
kūḍi śhrīveṁkaḍeśhum̐ḍu gora nŏttīni
yeḍam̐jūsinānu nīve ichchagamulāḍam̐gāne
jāḍa nuramĕkkiṁchi diṁcham̐gam̐jālam̐ḍu