ఏమి సేసినా నీచిత్త మింతయు నాభాగ్యము
(॥పల్లవి॥)
ఏమి సేసినా నీచిత్త మింతయు నాభాగ్యము
వేమరు నీతో పొందు విడువలేఁ జుమ్మీ
(॥ఏమి॥)
కలరు పదారువేలు కాంతలు తొల్లె నీకు
వెలయ నేనలిగితే వెఱచేవా
నెలవై నాకైతేను నీవే యేడుగడయు
మలసి నీతో పొందు మానలేదు సుమ్మీ
(॥ఏమి॥)
చేరి నిన్ను గొల్లెతలు సిగ్గులెల్లా విడిచిరి
వారియాస గద్దు నాచేవాటు వడేవా
కోరిన కోరికకు గుఱుతు నీవే నాకు
భారపడి నిమిషముఁ బాయలేను సుమ్మీ
(॥ఏమి॥)
యిందిరయు భూసతియు నిరువంక నున్నవారు
చెంది నే దూరిన దూరు చెవిఁ బెట్టేవా
కందువ శ్రీ వేంకటేశ కలసితి విటు నన్ను
నిందవేసి ఇఁక నిన్ను నేర మెంచఁజుమ్మీ
(||pallavi||)
emi sesinā nīsitta miṁtayu nābhāgyamu
vemaru nīdo pŏṁdu viḍuvalem̐ jummī
(||emi||)
kalaru padāruvelu kāṁtalu tŏllĕ nīgu
vĕlaya nenaligide vĕṟasevā
nĕlavai nāgaidenu nīve yeḍugaḍayu
malasi nīdo pŏṁdu mānaledu summī
(||emi||)
seri ninnu gŏllĕdalu siggulĕllā viḍisiri
vāriyāsa gaddu nāsevāḍu vaḍevā
korina korigagu guṟudu nīve nāgu
bhārabaḍi nimiṣhamum̐ bāyalenu summī
(||emi||)
yiṁdirayu bhūsadiyu niruvaṁka nunnavāru
sĕṁdi ne dūrina dūru sĕvim̐ bĕṭṭevā
kaṁduva śhrī veṁkaḍeśha kalasidi viḍu nannu
niṁdavesi im̐ka ninnu nera mĕṁcham̐jummī