ఎంచి చూడరో ఘనులార యిందీవరాక్షుఁడు రక్షకుఁడు
(॥పల్లవి॥)
ఎంచి చూడరో ఘనులార యిందీవరాక్షుఁడు రక్షకుఁడు
సంచితముగ నితని శరణంటే సర్వఫలప్రద మిందరికి
(॥ఎంచి॥)
హరిఁ గొలువని కొలువులు మఱి యడవిఁగాసిన వెన్నెలలు
గరిమల నచ్చుతు వినని కథలు భువి గజస్నానములు
పరమాత్మునికిఁ గాని తపంబులు పాతాళముల నిధానములు
మరుగురునికిఁ గాని పూవులపూజలు మగఁడులేని సింగారములు
(॥ఎంచి॥)
వైకుంఠుని నుతియించని వినుతులు వననిధిఁ గురిసిన వానలు
ఆ కమలోదరుఁ గోరనికోరికె లందని మానిఫలంబులు
శ్రీకాంతునిపైఁ జేయని భక్తులు చెంబుమీఁది కనకపుఁబూఁత
దాకొని విష్ణుని తెలియని తెలువులు తగ నేటినడిమి పైరులు
(॥ఎంచి॥)
వావిరిఁ గేశవునొల్లని బదుకులు వరతఁ గలపు చింతపండు
గోవిందుని కటు మొక్కని మొక్కులు గోడలేని పెనుచిత్రములు
భావించి మాధవుపై లేనితలఁపులు పలు మేఘముల వికారములు
శ్రీవేంకటపతికరుణ గలిగితే జీవుల కివియే వినోదములు
(||pallavi||)
ĕṁchi sūḍaro ghanulāra yiṁdīvarākṣhum̐ḍu rakṣhagum̐ḍu
saṁchidamuga nidani śharaṇaṁṭe sarvaphalaprada miṁdarigi
(||ĕṁchi||)
harim̐ gŏluvani kŏluvulu maṟi yaḍavim̐gāsina vĕnnĕlalu
garimala nachchudu vinani kathalu bhuvi gajasnānamulu
paramātmunigim̐ gāni tabaṁbulu pādāḽamula nidhānamulu
marugurunigim̐ gāni pūvulabūjalu magam̐ḍuleni siṁgāramulu
(||ĕṁchi||)
vaiguṁṭhuni nudiyiṁchani vinudulu vananidhim̐ gurisina vānalu
ā kamalodarum̐ goranigorigĕ laṁdani māniphalaṁbulu
śhrīgāṁtunibaim̐ jeyani bhaktulu sĕṁbumīm̐di kanagabum̐būm̐ta
dāgŏni viṣhṇuni tĕliyani tĕluvulu taga neḍinaḍimi pairulu
(||ĕṁchi||)
vāvirim̐ geśhavunŏllani badugulu varadam̐ galabu siṁtabaṁḍu
goviṁduni kaḍu mŏkkani mŏkkulu goḍaleni pĕnusitramulu
bhāviṁchi mādhavubai lenidalam̐pulu palu meghamula vigāramulu
śhrīveṁkaḍabadigaruṇa galigide jīvula kiviye vinodamulu