ఎంచి చూడ నెన్నిలేవు యీకె తలపోఁతలు
(॥పల్లవి॥)
ఎంచి చూడ నెన్నిలేవు యీకె తలపోఁతలు
నించిన వేడుక లిఁక నెరవేరుచవయ్యా
(॥ఎంచి॥)
వూర నూర నూటలాయ నుడివోని తమకము
నీరుకొద్దిదామరాయ నిండుమోహము
గోరగీర నేరులాయ కొమ్మకోరికలెల్లాను
గారవించి యిఁకనైనాఁ గరుణించవయ్యా
(॥ఎంచి॥)
పట్టఁ బట్టఁ బాములాయ పరగ నడియాసలు
ముట్టినదే ముయ్యాయ ముంచినేస్తము
చెట్టడువఁ జేటఁడాయ చెలరేఁగి వావులు
గుట్టుతోనే యిఁకనైనాఁ గొమ్మనేలుకోవయ్యా
(॥ఎంచి॥)
చెప్పఁ జెప్పఁ గొత్తలాయ చెలియవిరహమిది
తెప్పపై వోలాయఁ దరితీవు లెల్లాను
యిప్పుడు శ్రీవేంకటేశ యింతి నిట్టె యేలితివి
తప్పక నీవిఁకనైనాఁ దగ మన్నించవయ్యా
(||pallavi||)
ĕṁchi sūḍa nĕnnilevu yīgĕ talabom̐talu
niṁchina veḍuga lim̐ka nĕraverusavayyā
(||ĕṁchi||)
vūra nūra nūḍalāya nuḍivoni tamagamu
nīrugŏddidāmarāya niṁḍumohamu
goragīra nerulāya kŏmmagorigalĕllānu
gāraviṁchi yim̐kanainām̐ garuṇiṁchavayyā
(||ĕṁchi||)
paṭṭam̐ baṭṭam̐ bāmulāya paraga naḍiyāsalu
muṭṭinade muyyāya muṁchinestamu
sĕṭṭaḍuvam̐ jeḍam̐ḍāya sĕlarem̐gi vāvulu
guṭṭudone yim̐kanainām̐ gŏmmanelugovayyā
(||ĕṁchi||)
sĕppam̐ jĕppam̐ gŏttalāya sĕliyavirahamidi
tĕppabai volāyam̐ daridīvu lĕllānu
yippuḍu śhrīveṁkaḍeśha yiṁti niṭṭĕ yelidivi
tappaga nīvim̐kanainām̐ daga manniṁchavayyā