ఏమయ్యా తమకించే వెంత యాసోదకాఁడవు
(॥పల్లవి॥)
ఏమయ్యా తమకించే వెంత యాసోదకాఁడవు
కామించి చే మొక్కితేను కాఁగిలించేవు
(॥ఏమ॥)
నిమ్మపండ్లు కానుకఁగా నీకు నియ్యవచ్చితేను
అమ్మరో చన్నులేల అంటేవయ్యా
కమ్మరఁ బగడ మిట్టె కప్పముగాఁ బట్టితేను
వుమ్మడి మోవికేల నోరూరేవయ్యా
(॥ఏమ॥)
చొక్కపు పసిఁడిబొమ్మ సూడిదెగాఁ జూపితేను
పిక్కటిల్ల నాతో నేమి పెనఁగేవయ్యా
పక్కన నుడుగరగాఁ బచ్చడము గప్పఁగాను
అక్కరతో బయ్యదకొం గదేల పట్టేవయ్యా
(॥ఏమ॥)
వుంకువ నుంగరము నీ కుచితము దెచ్చితేను
కంకణము నాకేలఁ గట్టేవయ్యా
అంకెల శ్రీవేంకటేశ యన్నిటా నన్నేలితివి
పొంకపురతుల కెంత పొంది మన్నించేవయ్యా
(||pallavi||)
emayyā tamagiṁche vĕṁta yāsodagām̐ḍavu
kāmiṁchi se mŏkkidenu kām̐giliṁchevu
(||ema||)
nimmabaṁḍlu kānugam̐gā nīgu niyyavachchidenu
ammaro sannulela aṁṭevayyā
kammaram̐ bagaḍa miṭṭĕ kappamugām̐ baṭṭidenu
vummaḍi movigela norūrevayyā
(||ema||)
sŏkkabu pasim̐ḍibŏmma sūḍidĕgām̐ jūbidenu
pikkaḍilla nādo nemi pĕnam̐gevayyā
pakkana nuḍugaragām̐ bachchaḍamu gappam̐gānu
akkarado bayyadagŏṁ gadela paṭṭevayyā
(||ema||)
vuṁkuva nuṁgaramu nī kusidamu dĕchchidenu
kaṁkaṇamu nāgelam̐ gaṭṭevayyā
aṁkĕla śhrīveṁkaḍeśha yanniḍā nannelidivi
pŏṁkaburadula kĕṁta pŏṁdi manniṁchevayyā