ఏమని చెప్పుట మా యజ్ఞానము యెఱిఁగి యెఱిఁగి తెలియఁగలేము
(॥పల్లవి॥)
ఏమని చెప్పుట మా యజ్ఞానము యెఱిఁగి యెఱిఁగి తెలియఁగలేము
శ్రీమాధవ నీ మఱుఁగు చొచ్చితిమి చిత్తగించి దయఁ చూడఁగదే
(॥ఏమని॥)
నీవు రక్షకుఁడవై భువి నుండఁగ నే గడియించే దిఁక నేమీ
జీవాంతరాత్ముఁడవై యుండుదువట చేకొని కావక మానేవా
వేవేలుగఁ బుట్టించఁ గర్తవట వెలయించఁగ నీ భారము గాదా
భావించనేరక వట్టి స్వతంత్రము పయివేసికొనుచుఁ బరగేము
(॥ఏమని॥)
పలుదెఱఁగుల నీ నామము లుండఁగ పాపములకు వెఱవఁగనేలా
బలిమినీముద్రలు యంతటఁ జెల్లఁగ పై కొనునా యింక నరకముల
తలఁక కభయహస్తము నీ వెత్తఁగ దాసుల కిఁక నెక్కటి భీతి
నిలుపఁగ నేరక మనసు వెంబడినే నిచ్చనిచ్చలునుఁ బొరలేము
(॥ఏమని॥)
అది నీరూపము తిరువారాధన యైయుండఁగ వెదకఁగ నేలా
పదిలపుటాచార్యుఁడు గలుగఁగ నిహ పరముల త్రోవడుగఁగ నేలా
వుదుటున వరములు శ్రీవేంకటేశుఁ డొసగఁగ నే కోరఁగ నేలా
తుదమొద లెంచక యిన్నాళ్లు నేమఱి దొరకొని యింకనుతియించేము
(||pallavi||)
emani sĕppuḍa mā yajñānamu yĕṟim̐gi yĕṟim̐gi tĕliyam̐galemu
śhrīmādhava nī maṟum̐gu sŏchchidimi sittagiṁchi dayam̐ sūḍam̐gade
(||emani||)
nīvu rakṣhagum̐ḍavai bhuvi nuṁḍam̐ga ne gaḍiyiṁche dim̐ka nemī
jīvāṁtarātmum̐ḍavai yuṁḍuduvaḍa segŏni kāvaga mānevā
vevelugam̐ buṭṭiṁcham̐ gardavaḍa vĕlayiṁcham̐ga nī bhāramu gādā
bhāviṁchaneraga vaṭṭi svadaṁtramu payivesigŏnusum̐ baragemu
(||emani||)
paludĕṟam̐gula nī nāmamu luṁḍam̐ga pābamulagu vĕṟavam̐ganelā
baliminīmudralu yaṁtaḍam̐ jĕllam̐ga pai kŏnunā yiṁka naragamula
talam̐ka kabhayahastamu nī vĕttam̐ga dāsula kim̐ka nĕkkaḍi bhīdi
nilubam̐ga neraga manasu vĕṁbaḍine nichchanichchalunum̐ bŏralemu
(||emani||)
adi nīrūbamu tiruvārādhana yaiyuṁḍam̐ga vĕdagam̐ga nelā
padilabuḍāsāryum̐ḍu galugam̐ga niha paramula trovaḍugam̐ga nelā
vuduḍuna varamulu śhrīveṁkaḍeśhum̐ ḍŏsagam̐ga ne koram̐ga nelā
tudamŏda lĕṁchaga yinnāḽlu nemaṟi dŏragŏni yiṁkanudiyiṁchemu