ఏలొకో కర్మమా యిందుకుఁ బాలైతిని
(॥పల్లవి॥)
ఏలొకో కర్మమా యిందుకుఁ బాలైతిని
పాలుపడిన యీ జలభ్రమణమువలెను
(॥ఏలొ॥)
ధరలోఁ బుట్టినప్పుడే తలఁచ నీ యాత్మ
మరుగఁడు పరమైతే మరచీఁగాని
అరిది దుర్భాషల నలవడ్డనాలికె
హరినామములయందు నలవడదు
(॥ఏలొ॥)
జవకట్టి పూర్వవాసనల సంసారమే
చవియే తాఁగాని ముక్తి చవిగాదు
భువిఁగల విషయాలఁ బుంగుడయ్యీఁగాని మతి
వివరించి దైవమును వెదకలేదు
(॥ఏలొ॥)
శ్రీవేంకటేశుకృపచేత నింతేకాని
వావాత నివి గైవశము గావు
భావమిప్పుడితని పాదాలు చేరికాని
యేవుపమలనుఁ గాన మిన్నాళ్లును
(||pallavi||)
elŏgo karmamā yiṁdugum̐ bālaidini
pālubaḍina yī jalabhramaṇamuvalĕnu
(||elŏ||)
dharalom̐ buṭṭinappuḍe talam̐sa nī yātma
marugam̐ḍu paramaide marasīm̐gāni
aridi durbhāṣhala nalavaḍḍanāligĕ
harināmamulayaṁdu nalavaḍadu
(||elŏ||)
javagaṭṭi pūrvavāsanala saṁsārame
saviye tām̐gāni mukti savigādu
bhuvim̐gala viṣhayālam̐ buṁguḍayyīm̐gāni madi
vivariṁchi daivamunu vĕdagaledu
(||elŏ||)
śhrīveṁkaḍeśhukṛpaseda niṁtegāni
vāvāda nivi gaivaśhamu gāvu
bhāvamippuḍidani pādālu serigāni
yevubamalanum̐ gāna minnāḽlunu