ఎలయించి బిడ్డ వోజ యింత సేసితిరె మీరే
(॥పల్లవి॥)
ఎలయించి బిడ్డ వోజ యింత సేసితిరె మీరే
సొలసి మమ్ము దూరఁగఁ జోటేది మీకును
(॥ఎల॥)
వూరఁ గలపాలెల్లా నుట్లఁ బెట్టు కుండఁగాను
చేరువ నూరకుండునా శ్రీకృష్ణుఁడు
సారె సారె జవ్వనాన జడియుచు నుండఁగాను
కోరకు వూరకుండునా గొల్లెతలను
(॥ఎల॥)
కడలేనిదూడలను గాడి గట్టు కుండఁ గాను
విడిచి తోలకుండునా వీదుల వెంట
అడుకులుఁ జక్కిలాలు అట్టుకలు నిండుండఁగా
తొడికి కొల్లలాడ దొరకొన కుండునా
(॥ఎల॥)
దరిఁ జీరలు వెట్టి బిత్తలే నీళ్ళాడఁగాను
సరస మాడకుండునా చంకఁ బెట్టుక
పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశుఁడు
బెరసి మిమ్ము మరిగీఁ బెరచోట నుండునా
(||pallavi||)
ĕlayiṁchi biḍḍa voja yiṁta sesidirĕ mīre
sŏlasi mammu dūram̐gam̐ joḍedi mīgunu
(||ĕla||)
vūram̐ galabālĕllā nuṭlam̐ bĕṭṭu kuṁḍam̐gānu
seruva nūraguṁḍunā śhrīkṛṣhṇum̐ḍu
sārĕ sārĕ javvanāna jaḍiyusu nuṁḍam̐gānu
koragu vūraguṁḍunā gŏllĕdalanu
(||ĕla||)
kaḍalenidūḍalanu gāḍi gaṭṭu kuṁḍam̐ gānu
viḍisi tolaguṁḍunā vīdula vĕṁṭa
aḍugulum̐ jakkilālu aṭṭugalu niṁḍuṁḍam̐gā
tŏḍigi kŏllalāḍa dŏragŏna kuṁḍunā
(||ĕla||)
darim̐ jīralu vĕṭṭi bittale nīḽḽāḍam̐gānu
sarasa māḍaguṁḍunā saṁkam̐ bĕṭṭuga
paraga nalamelmaṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍu
bĕrasi mimmu marigīm̐ bĕrasoḍa nuṁḍunā