ఏలలోఁగీ నేలవీఁగీ నేలమొక్కీనే
(॥పల్లవి॥)
ఏలలోఁగీ నేలవీఁగీ నేలమొక్కీనే
తాలముచేయి వున్నది తన చేతఁ గాదా
(॥ఏల॥)
చలమరిదానఁ గాను సరిదానఁ గాను నాకు
వలెనా యింతేసి తనవన్నె ప్రియాలు
బలువుఁడు దనకు నేఁ బడఁతినై వుందానను
యెలమిఁ దాఁ జేసినవే యిచ్చకము గాదా
(॥ఏల॥)
వేసాలదానఁగాను వెక్కసపుదానఁగాను
పోసరించి నన్ను నింతపొగడనేతే
దాసినై వుందాన నేను తానె నన్ను నేలినాఁడు
వాసితోఁ దనతగవే వన్నె నాకుఁగాదా
(॥ఏల॥)
పంతమాడేదానఁ గాను పాసివుండేదానఁ గాను
పొంతనుండి తను నింతపొదుగనేలే
యింతలో శ్రీవేంకటేశుఁ డిన్నిటా నన్నుఁగూడె
సంతతము తనమాటే చవి నాకుఁగాదా
(||pallavi||)
elalom̐gī nelavīm̐gī nelamŏkkīne
tālamuseyi vunnadi tana sedam̐ gādā
(||ela||)
salamaridānam̐ gānu saridānam̐ gānu nāgu
valĕnā yiṁtesi tanavannĕ priyālu
baluvum̐ḍu danagu nem̐ baḍam̐tinai vuṁdānanu
yĕlamim̐ dām̐ jesinave yichchagamu gādā
(||ela||)
vesāladānam̐gānu vĕkkasabudānam̐gānu
posariṁchi nannu niṁtabŏgaḍanede
dāsinai vuṁdāna nenu tānĕ nannu nelinām̐ḍu
vāsidom̐ danadagave vannĕ nāgum̐gādā
(||ela||)
paṁtamāḍedānam̐ gānu pāsivuṁḍedānam̐ gānu
pŏṁtanuṁḍi tanu niṁtabŏduganele
yiṁtalo śhrīveṁkaḍeśhum̐ ḍinniḍā nannum̐gūḍĕ
saṁtadamu tanamāḍe savi nāgum̐gādā