ఏల నాతో బొంకవచ్చే వెఱఁగనా నేఁ దొల్లి
(॥పల్లవి॥)
ఏల నాతో బొంకవచ్చే వెఱఁగనా నేఁ దొల్లి
వాలాయించి మాకు మంచివాఁడవే యెప్పుడును
(॥ఏల॥)
దవ్వులనే మొక్కుమని దయ నాపైఁ బెట్టుమని
యెవ్వతె చెప్పెనో కాక యీబుద్ధులు
నివ్వటిల్ల నీ యంత నీవెఱఁగవింతేసి
చివ్వన నొకరి పెట్టుఁజెట్టవే యెప్పుడును
(॥ఏల॥)
చేచేత వేఁడుకొమ్మని చెక్కునాకు నొక్కుమని
యే చదువులోనుండెనో యీవోజలు
నీ చందములివి గావు నేఁడు గొత్తలా నాకు
సూచింప నొకరాడించే సూత్రమవెప్పుడును
(॥ఏల॥)
అక్కర నిచ్చలాడేవు ఆయము గరఁగించేవు
యెక్కడ నేరిచితివి యీరతులు
నిక్కి శ్రీ వేంకటేశుఁడ నేఁడు గూడితివిగాక
గుక్కకొకని పెంపుడుగున్నవే యెప్పుడును
(||pallavi||)
ela nādo bŏṁkavachche vĕṟam̐ganā nem̐ dŏlli
vālāyiṁchi māgu maṁchivām̐ḍave yĕppuḍunu
(||ela||)
davvulane mŏkkumani daya nābaim̐ bĕṭṭumani
yĕvvadĕ sĕppĕno kāga yībuddhulu
nivvaḍilla nī yaṁta nīvĕṟam̐gaviṁtesi
sivvana nŏgari pĕṭṭum̐jĕṭṭave yĕppuḍunu
(||ela||)
seseda vem̐ḍugŏmmani sĕkkunāgu nŏkkumani
ye saduvulonuṁḍĕno yīvojalu
nī saṁdamulivi gāvu nem̐ḍu gŏttalā nāgu
sūsiṁpa nŏgarāḍiṁche sūtramavĕppuḍunu
(||ela||)
akkara nichchalāḍevu āyamu garam̐giṁchevu
yĕkkaḍa nerisidivi yīradulu
nikki śhrī veṁkaḍeśhum̐ḍa nem̐ḍu gūḍidivigāga
gukkagŏgani pĕṁpuḍugunnave yĕppuḍunu