ఈ పాదమే కదా యిలనెల్లఁ గొలిచినది
(॥పల్లవి॥)
ఈ పాదమే కదా యిలనెల్లఁ గొలిచినది
యీ పాదమే కదా ఇందిరా హస్తముల కితవైనది
(॥ఈ పా॥)
ఈ పాదమేకదా ఇందరును మొక్కెడిది
యీ పాదమే కదా యీగగనగంగ పుట్టినది
యీ పాదమే కదా యెలమిఁ బెంపొందినది
యీ పాదమే కదా యిన్నిటాకి నెక్కుడైనది
(॥ఈ పా॥)
యీ పాదమే కదా యిభరాజు దలఁచినది
యీ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది
యీ పాదమే కదా యీబ్రహ్మ గడిగినది
యీ పాదమే కదా యెగసి బ్రహ్మండమంటినది
(॥ఈ పా॥)
యీ పాదమే కదా యిహపరము లొసగెడిది
యీ పాదమే కదా ఇల నహల్యకుఁ గోరికైనది
యీ పాదమే కదా యీక్షింప దుర్లభము
యీ పాదమే కదా యీవేంకటాద్రిపై నిరవైనది
(||pallavi||)
ī pādame kadā yilanĕllam̐ gŏlisinadi
yī pādame kadā iṁdirā hastamula kidavainadi
(||ī pā||)
ī pādamegadā iṁdarunu mŏkkĕḍidi
yī pādame kadā yīgaganagaṁga puṭṭinadi
yī pādame kadā yĕlamim̐ bĕṁpŏṁdinadi
yī pādame kadā yinniḍāgi nĕkkuḍainadi
(||ī pā||)
yī pādame kadā yibharāju dalam̐sinadi
yī pādame kadā yiṁdrādulĕlla vĕdaginadi
yī pādame kadā yībrahma gaḍiginadi
yī pādame kadā yĕgasi brahmaṁḍamaṁṭinadi
(||ī pā||)
yī pādame kadā yihabaramu lŏsagĕḍidi
yī pādame kadā ila nahalyagum̐ gorigainadi
yī pādame kadā yīkṣhiṁpa durlabhamu
yī pādame kadā yīveṁkaḍādribai niravainadi