ఎదురుమాటలాడితి నీకు యీతప్పులు లోఁగొను నీవు
(॥పల్లవి॥)
ఎదురుమాటలాడితి నీకు యీతప్పులు లోఁగొను నీవు
పదరఁగఁ దగదు నీకు పంతములిచ్చితిఁ గావఁ గదే
(॥ఎదు॥)
మునుపే నే విన్నవించితిని విన నవధరించితివి నీవు
వెనక వేసుకో శరణు చొచ్చితిని విడువకు నన్ననుచు
ననుఁ జూచి 'దేహి' యంటే 'నాస్తి' యనరాదు నీకు
ఘనయాచకుఁడను నేను కడుదాతవు నీవు
(॥ఎదు॥)
వెదకి నిను వేఁడుకొంటిని విచ్చేసితివి మాయింటికి
వదలఁదగదు నీభక్తి యొసఁగు నీవాఁడను పాయకుమనుచు
పదిలంబుగ మొక్కిన చేతులు బలిమిఁ గోయరాదు
యిదివో బంటను నేను యేలినవాఁడవు నీవు
(॥ఎదు॥)
మురిగి నీముద్రలు మోచితిని మన్నించితివిటు నను నీవు
కరుణతోడ నాయపరాధంబులు కడపు కావుమనుచు
యిరవై నీపేరు వెట్టితే నియ్యకొనక పోరాదు
నరమాత్రుఁడ నే శ్రీవేంకటేశ నాయకుఁడవు నీవు
(||pallavi||)
ĕdurumāḍalāḍidi nīgu yīdappulu lom̐gŏnu nīvu
padaram̐gam̐ dagadu nīgu paṁtamulichchidim̐ gāvam̐ gade
(||ĕdu||)
munube ne vinnaviṁchidini vina navadhariṁchidivi nīvu
vĕnaga vesugo śharaṇu sŏchchidini viḍuvagu nannanusu
nanum̐ jūsi 'dehi' yaṁṭe 'nāsti' yanarādu nīgu
ghanayāsagum̐ḍanu nenu kaḍudādavu nīvu
(||ĕdu||)
vĕdagi ninu vem̐ḍugŏṁṭini vichchesidivi māyiṁṭigi
vadalam̐dagadu nībhakti yŏsam̐gu nīvām̐ḍanu pāyagumanusu
padilaṁbuga mŏkkina sedulu balimim̐ goyarādu
yidivo baṁṭanu nenu yelinavām̐ḍavu nīvu
(||ĕdu||)
murigi nīmudralu mosidini manniṁchidiviḍu nanu nīvu
karuṇadoḍa nāyabarādhaṁbulu kaḍabu kāvumanusu
yiravai nīberu vĕṭṭide niyyagŏnaga porādu
naramātrum̐ḍa ne śhrīveṁkaḍeśha nāyagum̐ḍavu nīvu