ఎదురుబడి సొలయ నిఁకనేలయ్యా
(॥పల్లవి॥)
ఎదురుబడి సొలయ నిఁకనేలయ్యా
ముదముతోడ నీకు మొక్కేమయ్యా
(॥॥)
వనితల నందరిని వలపించ నేరుతువు
పెనుపెట్టి మచ్చికులు పెంచనేర్తువు
మనసురా నన్నిటాను మాటలాడ నేరుతువు
పనితోడ నేమెల్లా బదికితిమయ్యా
(॥॥)
క్రియలు దెలిపి తమి కెరలించ నేరుతువు
నయములుగా కడునవ్వనేర్తువు
ప్రియములు చూపి యాస పెచ్చురేఁచ నేరుతువు
నియతాన నీ కృపను నెలకొంటిమయ్యా
(॥॥)
విందు చెప్పి మోవియిచ్చి వెలయించ నేరుతువు
అంది కాఁగిలించి కళ లంటనేర్తువు
చెందితివి నన్ను నిట్టె శ్రీ వేంకటేశ్వర
మందలించి నిన్ను నేము మరఁగితిమయ్యా
(||pallavi||)
ĕdurubaḍi sŏlaya nim̐kanelayyā
mudamudoḍa nīgu mŏkkemayyā
(||||)
vanidala naṁdarini valabiṁcha neruduvu
pĕnubĕṭṭi machchigulu pĕṁchanerduvu
manasurā nanniḍānu māḍalāḍa neruduvu
panidoḍa nemĕllā badigidimayyā
(||||)
kriyalu dĕlibi tami kĕraliṁcha neruduvu
nayamulugā kaḍunavvanerduvu
priyamulu sūbi yāsa pĕchchurem̐sa neruduvu
niyadāna nī kṛpanu nĕlagŏṁṭimayyā
(||||)
viṁdu sĕppi moviyichchi vĕlayiṁcha neruduvu
aṁdi kām̐giliṁchi kaḽa laṁṭanerduvu
sĕṁdidivi nannu niṭṭĕ śhrī veṁkaḍeśhvara
maṁdaliṁchi ninnu nemu maram̐gidimayyā