ఎదుటనే వున్నది యింతి గడుఁ బిన్నది
(॥పల్లవి॥)
ఎదుటనే వున్నది యింతి గడుఁ బిన్నది
ఇదివో మా విన్నపా లిచ్చగించవయ్యా
(॥॥)
సెలవుల నవ్వుగారీ చెక్కులఁ జెమట జారీ
నిలువెల్లా సిగ్గుదేరీ నెలఁతకు
పలుకులఁ దేనె లూరీ భావములోఁ దమి మీరీ
కలిసి మెలసి యీకెఁ గాఁగిలించవయ్యా
(॥॥)
కన్నుల వెరగుమించీ కళలు మోమునఁ బొంచీ
చన్నులపైఁ బులకలు సారెకు ముంచీ
సన్నలు బొమ్మల వంచీ చవు లాసలనుఁ బెంచీ
మన్ననల నీకెను మరిగించవయ్యా
(॥॥)
మోవి నమృతము చిందీ మూఁపునఁ దురుము చెందీ
సేవలుగా చెనకులు చేతికి నందీ
యీవేళ నలమేల్మంగ ఇన్నిటాను నిన్నుఁ బొందీ
శ్రీవేంకటేశ యీకెఁ జేకొంటివేలవయ్యా
(||pallavi||)
ĕduḍane vunnadi yiṁti gaḍum̐ binnadi
idivo mā vinnabā lichchagiṁchavayyā
(||||)
sĕlavula navvugārī sĕkkulam̐ jĕmaḍa jārī
niluvĕllā sigguderī nĕlam̐tagu
palugulam̐ denĕ lūrī bhāvamulom̐ dami mīrī
kalisi mĕlasi yīgĕm̐ gām̐giliṁchavayyā
(||||)
kannula vĕragumiṁchī kaḽalu momunam̐ bŏṁchī
sannulabaim̐ bulagalu sārĕgu muṁchī
sannalu bŏmmala vaṁchī savu lāsalanum̐ bĕṁchī
mannanala nīgĕnu marigiṁchavayyā
(||||)
movi namṛtamu siṁdī mūm̐punam̐ durumu sĕṁdī
sevalugā sĕnagulu sedigi naṁdī
yīveḽa nalamelmaṁga inniḍānu ninnum̐ bŏṁdī
śhrīveṁkaḍeśha yīgĕm̐ jegŏṁṭivelavayyā