దోసము లేదనవయ్య తొక్కితి నీ పాదము
(॥పల్లవి॥)
దోసము లేదనవయ్య తొక్కితి నీ పాదము
వేసారక నింద నీపై వేసితి నేను
(॥దోసము॥)
వేడుకతోడి నావిరహవేదనకుఁ గా
నాడరాని కల్లలెల్ల నాడితి నిన్ను
వాడలోన నీవురాఁగా వలపుల చింతనొంది
వోడక మంచముమీఁద నుండితి నేను
(॥దోసము॥)
పాయపు మదముతోడ పక్కన రాకుండఁగాను
సేయరాని సేతలెల్లఁ జేసితి నిన్ను
చేయి నీవు వేయఁగాను చిమ్మిరేఁగి వేసటతో
తోయరాని ఆనవెట్టి దూరితి నేను
(॥దోసము॥)
తగులైన తమకాన దప్పిదేరుచ కుండఁగా
నగరాని నవ్వులెల్ల నవ్వితి నిన్ను
నిగిడి శ్రీవేంకటేశ నీవు నన్ను నేలఁగాను
మొగము చూచిచూచి మొక్కితి నేను
(||pallavi||)
dosamu ledanavayya tŏkkidi nī pādamu
vesāraga niṁda nībai vesidi nenu
(||dosamu||)
veḍugadoḍi nāvirahavedanagum̐ gā
nāḍarāni kallalĕlla nāḍidi ninnu
vāḍalona nīvurām̐gā valabula siṁtanŏṁdi
voḍaga maṁchamumīm̐da nuṁḍidi nenu
(||dosamu||)
pāyabu madamudoḍa pakkana rāguṁḍam̐gānu
seyarāni sedalĕllam̐ jesidi ninnu
seyi nīvu veyam̐gānu simmirem̐gi vesaḍado
toyarāni ānavĕṭṭi dūridi nenu
(||dosamu||)
tagulaina tamagāna dappiderusa kuṁḍam̐gā
nagarāni navvulĕlla navvidi ninnu
nigiḍi śhrīveṁkaḍeśha nīvu nannu nelam̐gānu
mŏgamu sūsisūsi mŏkkidi nenu