దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ
(॥పల్లవి॥)
దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ
వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా
(॥దేవు॥)
ధర్మార్థకామ మోక్షతతులు నీ సోబనాలు
అర్మిలి నాలుగు వేదాలదె నీ దరులు
నిర్మలపు నీ జలము నిండు సప్తసాగరాలు
కూర్మము నీలోఁతు వో కోనేరమ్మా
(॥దేవు॥)
తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు
జగతి దేవతలు నీ జలజంతులు
గగనపుఁ బుణ్యలోకాలు నీదరి మేడలు
మొగి నీ చుట్టు మాఁకులు మునులోయమ్మా
(॥దేవు॥)
వైకుంఠనగరము వాకిలే నీ యాకారము
చేకొను పుణ్యములే నీ జీవభావము
యేకడను శ్రీవేంకటేశుఁడే నీ వునికి
దీకొని నీ తీర్థమాడితిమి కావవమ్మా
(||pallavi||)
devunigi devigini tĕppala koneḍamma
vevelu mŏkkulu logabāvani nīgammā
(||devu||)
dharmārdhagāma mokṣhadadulu nī sobanālu
armili nālugu vedāladĕ nī darulu
nirmalabu nī jalamu niṁḍu saptasāgarālu
kūrmamu nīlom̐tu vo konerammā
(||devu||)
tagina gaṁgādi tīrdhamulu nī kaḍaḽḽu
jagadi devadalu nī jalajaṁtulu
gaganabum̐ buṇyalogālu nīdari meḍalu
mŏgi nī suṭṭu mām̐kulu munuloyammā
(||devu||)
vaiguṁṭhanagaramu vāgile nī yāgāramu
segŏnu puṇyamule nī jīvabhāvamu
yegaḍanu śhrīveṁkaḍeśhum̐ḍe nī vunigi
dīgŏni nī tīrdhamāḍidimi kāvavammā