బంగారువంటి మేనెల్లాఁ బచ్చి సేసుకొంటివి
(॥పల్లవి॥)
బంగారువంటి మేనెల్లాఁ బచ్చి సేసుకొంటివి
సింగారా లద్దములోనఁ జేరి చూచుకోవయ్యా
(॥బంగా॥)
అగ్గలమై సతిసొమ్ము లవె నీబుజాల నొత్తె
బిగ్గెఁ గాఁగిలించుకొని పెనఁగితివో
వొగ్గి వట్లుగట్టుక వున్నది సెలవిఁ దమ్మ
యెగ్గులేక విడెముసే సింతికిఁ బెట్టితివి
(॥బంగా॥)
మించి నీచేతులఁ గడుమెఱుఁ గై జిడ్డంటె నదె
పొంచి జవ్వా దాపెమేనఁ బూసితివో
నించి లత్తుకరేకలు నీవొసల నంటినవి
వంచనతో నాపెకు వలచి మొక్కితివో
(॥బంగా॥)
కప్పి నీచెక్కులవెంటఁ గారీఁ బెఁ(బెం?) జెమటలు
చెప్పరానిచేఁత లట్టె సేసుకొంటివో
యిప్పుడు శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
చొప్పులు నావల్ల గడించుక మెఱసితివో
(||pallavi||)
baṁgāruvaṁṭi menĕllām̐ bachchi sesugŏṁṭivi
siṁgārā laddamulonam̐ jeri sūsugovayyā
(||baṁgā||)
aggalamai sadisŏmmu lavĕ nībujāla nŏttĕ
biggĕm̐ gām̐giliṁchugŏni pĕnam̐gidivo
vŏggi vaṭlugaṭṭuga vunnadi sĕlavim̐ damma
yĕggulega viḍĕmuse siṁtigim̐ bĕṭṭidivi
(||baṁgā||)
miṁchi nīsedulam̐ gaḍumĕṟum̐ gai jiḍḍaṁṭĕ nadĕ
pŏṁchi javvā dābĕmenam̐ būsidivo
niṁchi lattugaregalu nīvŏsala naṁṭinavi
vaṁchanado nābĕgu valasi mŏkkidivo
(||baṁgā||)
kappi nīsĕkkulavĕṁṭam̐ gārīm̐ bĕm̐(bĕṁ?) jĕmaḍalu
sĕpparānisem̐ta laṭṭĕ sesugŏṁṭivo
yippuḍu śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
sŏppulu nāvalla gaḍiṁchuga mĕṟasidivo