అవధరించవయ్యా అట్టె కలకాలము
(॥పల్లవి॥)
అవధరించవయ్యా అట్టె కలకాలము
తవిలి సేవలు సేసీఁ దరుణి నీకు
(॥ఆవ॥)
నెలఁతచెమటలే పన్నీటి మజ్జనము నీకు
తళుకుఁబయ్యదకొంగు తడియొత్తు
కలికినవ్వులే కప్పురకాపు నీకు
పొలుపొందఁ జూపులే పుణుఁగుకావు
(॥ఆవ॥)
మగువయంగరాగమే మంచిచంద్రగావిదట్టి
తగుఁగాఁగిటిచేతులే తమ్మిపూజలు
చిగురుఁబెదవులే శ్రీతులసీదళములు
మొగి రతిచెనకులే మునుకొన్నసొమ్ములు
(॥ఆవ॥)
అలమేలుమంగ తానే యక్కుననుండేదేవులు
పలుకులే వేదమంత్రపాటలు
యెలమి శ్రీవేంకటేశ యెంచి చూచితే నీకు
జలజాక్షిసరసాలు సకలసంపదలు
(||pallavi||)
avadhariṁchavayyā aṭṭĕ kalagālamu
tavili sevalu sesīm̐ daruṇi nīgu
(||āva||)
nĕlam̐tasĕmaḍale pannīḍi majjanamu nīgu
taḽugum̐bayyadagŏṁgu taḍiyŏttu
kaliginavvule kappuragābu nīgu
pŏlubŏṁdam̐ jūbule puṇum̐gugāvu
(||āva||)
maguvayaṁgarāgame maṁchisaṁdragāvidaṭṭi
tagum̐gām̐giḍisedule tammibūjalu
sigurum̐bĕdavule śhrīdulasīdaḽamulu
mŏgi radisĕnagule munugŏnnasŏmmulu
(||āva||)
alamelumaṁga tāne yakkunanuṁḍedevulu
palugule vedamaṁtrabāḍalu
yĕlami śhrīveṁkaḍeśha yĕṁchi sūside nīgu
jalajākṣhisarasālu sagalasaṁpadalu