ఔనయ్యా మంచివాఁడ వౌదువయ్యా
(॥పల్లవి॥)
ఔనయ్యా మంచివాఁడ వౌదువయ్యా
పూని పట్టి వలపులు పులియఁ బెట్టుదురా
(॥ఔన॥)
సిగ్గువడ్డాపె నొయ్యనే చెక్కునొక్కుదురు గాక
బగ్గనను గిలిగించి పచ్చిసేతురా
వొగ్గి తలవంచుకుంటే నొడఁబరతురు గాక
బెగ్గిల లేఁతచన్నులు పిసుకుదురా
(॥ఔన॥)
ముసుఁగు వెట్టుకుంటే మొగము చూతురు గాక
అసురుసురై పెనఁగి అలయింతురా
అసు దైవుండిన కన్నె నాదరింతురు గాక
కిసుకాటపురతుల గిజిబిజి సేతురా
(॥ఔన॥)
దండనింతి గూచుండితే తమి రేఁతురు గాక
గండుమీరి మేనెల్లా రేకలు దీతురా
నిండార శ్రీ వేంకటేశ నెలఁత నిన్నుఁ గూడెను
దుండగపుసరసాన దొమ్మిసేతురా
(||pallavi||)
aunayyā maṁchivām̐ḍa vauduvayyā
pūni paṭṭi valabulu puliyam̐ bĕṭṭudurā
(||auna||)
sigguvaḍḍābĕ nŏyyane sĕkkunŏkkuduru gāga
baggananu giligiṁchi pachchisedurā
vŏggi talavaṁchuguṁṭe nŏḍam̐baraduru gāga
bĕggila lem̐tasannulu pisugudurā
(||auna||)
musum̐gu vĕṭṭuguṁṭe mŏgamu sūduru gāga
asurusurai pĕnam̐gi alayiṁturā
asu daivuṁḍina kannĕ nādariṁturu gāga
kisugāḍaburadula gijibiji sedurā
(||auna||)
daṁḍaniṁti gūsuṁḍide tami rem̐turu gāga
gaṁḍumīri menĕllā regalu dīdurā
niṁḍāra śhrī veṁkaḍeśha nĕlam̐ta ninnum̐ gūḍĕnu
duṁḍagabusarasāna dŏmmisedurā