అన్నియు నడుగవే నేనే మఱచితి నవి హరి నీకే తెలిసినవి
(॥పల్లవి॥)
అన్నియు నడుగవే నేనే మఱచితి నవి హరి నీకే తెలిసినవి
మన్నించి నా కీజన్మ మొసఁగితివి మర్మగాఁడు మన్మథుఁడొఁకడు
(॥అన్ని॥)
పలుజన్మంబులు నేఁ ద్రాగిన చనుఁబాలు గొలిచితే నెన్నౌనో
తలిదండ్రులు మరియెందరో తా మెక్కడ నున్నారో
తిలకింపఁగ నాహారంబునకును తెగినకొలుచు లవి యెన్నెన్నో
యిలపై నే బ్రదికినకాలము యెంతని వ్రాసెనో చిత్రగుప్తుఁడు
(॥అన్ని॥)
చినుఁగఁగఁ జినుఁగఁగఁ గట్టుకోకలకుఁ జెల్లినపత్తి దా నదియంతో
కనక మెంతో నాకాభరణములై కాయంబులతో నొరసినది
పెనఁగీ రమించిన కామినీమణుల పేరు లెన్నియో తొల్లిటివి
ఘనముగ నను నిటు భోగించఁజేసిన కర్మమే యెఱుఁగు నివియెల్లా
(॥అన్ని॥)
గరిమల నే గడియించినయిండ్లుఁ గాణాచిచోట్లు యేడేడో
పొరలిన యిడుమలు యెందుకెక్కెనో పొదలితి భువిపై నిన్నాళ్లు
అరయఁగ నందరి కంతర్యామిని అఖిలకారణంబును నీవే
నిరతపు శ్రీవేంకటేశ్వర దయగల నీచిత్త మెటువలెఁ దలచీనో
(||pallavi||)
anniyu naḍugave nene maṟasidi navi hari nīge tĕlisinavi
manniṁchi nā kījanma mŏsam̐gidivi marmagām̐ḍu manmathum̐ḍŏm̐kaḍu
(||anni||)
palujanmaṁbulu nem̐ drāgina sanum̐bālu gŏliside nĕnnauno
talidaṁḍrulu mariyĕṁdaro tā mĕkkaḍa nunnāro
tilagiṁpam̐ga nāhāraṁbunagunu tĕginagŏlusu lavi yĕnnĕnno
yilabai ne bradiginagālamu yĕṁtani vrāsĕno sitraguptum̐ḍu
(||anni||)
sinum̐gam̐gam̐ jinum̐gam̐gam̐ gaṭṭugogalagum̐ jĕllinabatti dā nadiyaṁto
kanaga mĕṁto nāgābharaṇamulai kāyaṁbulado nŏrasinadi
pĕnam̐gī ramiṁchina kāminīmaṇula peru lĕnniyo tŏlliḍivi
ghanamuga nanu niḍu bhogiṁcham̐jesina karmame yĕṟum̐gu niviyĕllā
(||anni||)
garimala ne gaḍiyiṁchinayiṁḍlum̐ gāṇāsisoṭlu yeḍeḍo
pŏralina yiḍumalu yĕṁdugĕkkĕno pŏdalidi bhuvibai ninnāḽlu
arayam̐ga naṁdari kaṁtaryāmini akhilagāraṇaṁbunu nīve
niradabu śhrīveṁkaḍeśhvara dayagala nīsitta mĕḍuvalĕm̐ dalasīno