(॥పల్లవి॥)
అంగనకు విరహమే సింగారమాయ
చెంగట నీవే యిది చిత్తగించవయ్యా
(॥అంగ॥)
కలికి నిన్నుఁ దలఁచి గక్కున లోలోఁ గరఁగి
జలజలఁ జెమరించి జలకమాడె
బలుతమకాన నీకుఁ బక్కన నెదురువచ్చి
నిలువునఁ గొప్పువీడి నీలిచీర గప్పెను
(॥అంగ॥)
సుదతి నిన్నుఁ జూచి సోయగపుసిగ్గులను
పొదలి చెక్కులదాఁకాఁ బూసె గంధము
మదనమంత్రములైనమాటల మర్మము సోఁకి
ముదురుఁబులకలను ముత్యాలు గట్టెను
(॥అంగ॥)
గక్కన గాఁగిట నిన్నుఁ గలసి యీమానిని
చొక్కి చంద్రాభరణపుసొమ్ములు వెట్టె
అక్కున శ్రీవేంకటేశ అలమేలుమంగ నీకు
దక్కి సరసములను తలఁబాలు వోసెను
(||pallavi||)
aṁganagu virahame siṁgāramāya
sĕṁgaḍa nīve yidi sittagiṁchavayyā
(||aṁga||)
kaligi ninnum̐ dalam̐si gakkuna lolom̐ garam̐gi
jalajalam̐ jĕmariṁchi jalagamāḍĕ
baludamagāna nīgum̐ bakkana nĕduruvachchi
niluvunam̐ gŏppuvīḍi nīlisīra gappĕnu
(||aṁga||)
sudadi ninnum̐ jūsi soyagabusiggulanu
pŏdali sĕkkuladām̐kām̐ būsĕ gaṁdhamu
madanamaṁtramulainamāḍala marmamu som̐ki
mudurum̐bulagalanu mutyālu gaṭṭĕnu
(||aṁga||)
gakkana gām̐giḍa ninnum̐ galasi yīmānini
sŏkki saṁdrābharaṇabusŏmmulu vĕṭṭĕ
akkuna śhrīveṁkaḍeśha alamelumaṁga nīgu
dakki sarasamulanu talam̐bālu vosĕnu